ఆకాశంలోని రెండు తారలు
భూమిమీద సడివిన పాదాలకు
వెలుగును అద్దాలని
ఆరాట పడుతున్నవి
కుదరక కన్నీరు కార్చుతున్నవి
అవునులే
గతం పరాయి పెత్తనంపై
జరిపిన సమరం ఓ కన్నీటి చరిత్ర ..
పుటల్లో సదవనికే కదా...!
ఆచరణ ఆకాశాన్ని అంటింది..
ఉన్నదే తిని
లేనప్పుడు ఆశయాల్ని మింగి
గుండె నిబ్బరంతో
అడుగు ముందుపడ్డ
వర్ణ వివక్ష
విశృంఖల విహారం చేసిన
కులం వర్గంలో
ఆలోచనని మింగచూసిన
కొన్ని కపట శక్తులను
అడ్డంకులను ఆకాటితో అధిగమించి
సాధించిన పత్రం..
నిరుద్యోగ దుఃఖాన్ని ఆపలేకుండా
ఏకాంతంలో అంతర్యుద్ధం చేస్తుంది...
దళిత బంధు, రైతు బంధు,
ఇంకో కొత్త 'బంధు' బంధాలన్నీ ఓట్లు రాల్చడానికి
పడే పాట్లు
ఒక్క పారి రైలు పట్టాలతో
మొరపెట్టుకున్నా
మాంసం ముద్దని అడగండి..
స్వరాష్ట్ర సాధనకై ఆ నెత్తురు
ఎన్ని మార్లు
లాఠీ దెబ్బల గుర్తులు
ఎన్ని ధరించిందో?
అవునులే..
బతికున్నోడే అనుభవించాలనే
త్యాగాల చరిత అక్కరలేని గొర్రెలు
రోజూ ఉన్ని నిచ్చినప్పుడు
రగ్గులవ్వడం ఏమంత పని...
ఇప్పుడు నిరుద్యోగం
అదృశ్య దుఃఖం..
ఎంతకీ తీరని
అరణ్యరోదన అన్ని దుకాణాల్లో
పొట్లాల ప్యాకింగ్‌లో
రాటు దేలుతున్నై
కొన్నేమో చెప్పలేక ఉరికొయ్యల్ని ముద్దాడుతున్నాయి..
ఫలాలు మాత్రం కొందరికే..
స్వరాష్ట్ర ఉద్యోగ ప్రకటన ఊట
నిరుద్యోగుల పాలిట
ఎడారిగా మారడం..
ఆకాశ రోదనే....
నాగరాజు మద్దెల
63019 93211