Sep 20,2023 21:37

జయంతి వేడుకల్లో వక్తలు
ప్రజాశక్తి - భీమవరం

             ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, హైదరాబాద్‌ ఇసిఐఎల్‌ ఫౌండర్‌, పద్మభూషణ్‌ డాక్టర్‌ ఎఎస్‌.రావును ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మోగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎఎస్‌.రావు 109వ జయంతి వేడుక బుధవారం ఘనంగా నిర్వహించారు. తాగునీటి చెరువుగట్టుపై ఉన్న ఎఎస్‌.రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్ర మంలో పలువురు వక్తలు మాట్లాడారు. విద్యార్థులకు, యువతీ యువకులకు, శాస్త్రవేత్తలకు, భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. అనంతరం 2022-23 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు బహుమతులు, గోల్డ్‌మెడల్‌, సర్టిఫికెట్లను అందించారు. ఉత్తమ ఉపాధ్యాయులను డాక్టర్‌ ఎఎస్‌.రావు మెమోరియల్‌ అవార్డుతో సత్కరించారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతూ ప్రతిభ కనబరిచిన 26 మంది విద్యార్థులకు అవార్డులు అందించారు.