
జయంతి వేడుకలో వక్తలు
ప్రజాశక్తి - వీరవాసరం
చిలకమర్తి లక్ష్మీనరసింహం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. జాతీయ కవి, కళాప్రపూర్ణ, స్వాతంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు చిలకమర్తి లక్ష్మీనరసింహం 156వ జయంతిని వీరవాసరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం అధ్యక్షులు గుండా రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలను నిర్వహించారు. తూర్పుచెరువు గట్టుపై ఉన్న చిలకమర్తి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ చిలకమర్తి జీవిత చరిత్రను, ఔన్నత్యాన్ని వివరించారు.ఈ సందర్భంగా కెజిఆర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయన చంద్రాజీ, ఎంఆర్‌కె జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు జుత్తిగ శ్రీనివాస్, సంస్కృత ఉపాధ్యాయుడు చిలుకూరి ఫణికుమార్, తెలుగు ఉపాధ్యాయుడు పంపన సాయిబాబు, కుసుమే ఆనందరావులను కళాపరిషత్ తరపున చిలకమర్తి పురస్కారంతో సత్కరించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంచారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, జవ్వాది దాశరధి శ్రీనివాస్, గోదాసి రాంబాబు పాల్గొన్నారు. వీరవాసరం గ్రంథాలయంలో ఉన్న చిలకమర్తి విగ్రహానికి గ్రంథ పాలకుడు బి.హనుమంతరావు ఆధ్వర్యంలో, ఎంఆర్‌కె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు జుత్తిగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిలకమరి లక్ష్మీనరసింహం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.