Aug 23,2023 22:41

టంగుటూరి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌

* ఘనంగా టంగుటూరి జయంతి వేడుకలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయులని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. టంగుటూరి జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టిందన్నారు. 1940-50వ దశకంలో ఆంధ్రా రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయమన్నారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పోలీసు తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన ధీరోదాత్తుడని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, కలెక్టరెట్‌ ఇ-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ డి.రామ్మూర్తి, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి గడ్డెమ్మ, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి అనురాధ, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధీరత్వానికి టంగుటూరి ప్రతీక : ఎస్‌పి
జిల్లా పోలీసు కార్యాలయంలో టంగుటూరి చిత్రపటానికి ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధీరత్వానికి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రతీక అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారని కొనియాడారు. ఎస్‌ఇబి జెడి వి.ఎన్‌ మణికంఠ, ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు ఎస్‌.బాలరాజు, విజరు కుమార్‌ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఉమామహేశ్వరరావు, సిఐలు పి.శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎస్‌ఐలు, కార్యాలయ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.