28వ వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
ప్రజాశక్తి - ఏలూరు
కమ్యూనిస్టు నేత, మాజీ ఎంపీ ఉద్దరాజు రామం ఆదర్శనీయులని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో రామం 28వ వర్థంతి సభ ఆదివారం నిర్వహించారు. తొలుత రామం చిత్రపటానికి రవి, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రామం నిరాడంబర జీవి అని, త్యాగశీలి అని కొనియాడారు. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా పట్టుదలతో హిందీ నేర్చుకుని పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై అనర్గళంగా మాట్లాడారన్నారు. మార్క్సిజం ప్రజలందరికీ అర్థం కావడానికి భగత్‌సింగ్ శిష్యుడైన శివవర్మ రచించిన మార్క్సిజం ఓనమాలు అనే పుస్తకాన్ని సులభశైలిలో తెలుగులోకి అనువదించారని తెలిపారు. రామం సతీమణి మాణిక్యాంబ కూడా స్వాతంత్య్ర సమరయోధురాలిగా, మహిళా నాయకురాలిగా పని చేశారని తెలిపారు. వారి జీవితాన్ని నేటి ప్రజలు, యువకులు, మహిళలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రామం వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర 29వ మహాసభ సందర్భంగా ఈ నెల 28వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జంగారెడ్డిగూడెంలోని ఎంబి సోషల్ క్లబ్‌లో 'వ్యవసాయ రంగ సంక్షోభం-పరిష్కార మార్గాలు' అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.మంగరాజు, సంఘాల నాయకులు. శ్యామలారాణి, కె.విజయలక్ష్మి, రామాంజనేయులు, కోటేశ్వరరావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.










