Jul 09,2023 21:30

రామారావును ఊరేగిస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి - సీతంపేట :  తోటి ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడు రామారావు మాస్టారని ఎంఇఒలు ఆనందరావు, సూర్యచంద్రరావు అన్నారు. మండలంలో పూలిపుట్టి పంచాయతీ ఆనపకాయలగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంపిలి రామారావుకు మండ కాలనీలో పాఠశాలకు బదిలీ అయ్యింది. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు రామారావు దంపతులను ఘనంగా సన్మానించారు. తొలుత ఆ గ్రామ గిరిజనులు మేళతాళాలతో, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో స్వాగతం పలికారు. కాలు కడిగి ఊరంతా భుజంపై కూర్చుని పెట్టి ఊరేగించారు. అనంతరం జరిగిన సభలో ఎంఇఒలు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా ప్రజల మన్ననలు ఇంతగా పొందడం గొప్ప విషయమన్నారు. ఉపాధ్యాయుడిగా ఇక్కడ గిరిజనులకు ఐదేళ్లుగా అనేక సేవలు అందించారని, అందుకే ఇక్కడ ప్రజలు బ్రహ్మ రథం పట్టారని కొనియాడారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు సన్మానించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ దండు ప్రకాశరావు, జిల్లా కార్యదర్శి కె.కృష్ణారావు, గౌరవ అధ్యక్షులు హారిక భాస్కర రావు, కార్యదర్శి సింహాచలం, ప్రకాశం, కె.పారయ్య, కాంతారావు, కృష్ణారావు, ఈదపురం ప్రధానోపాధ్యాయులు బి.రామారావు, పాలకొండ యుటిఎఫ్‌ మండల కార్యదర్శి పి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.