ప్రజాశక్తి - ములగాడ : ఆదర్శనీయుడు నూనెల శ్రీనివాసరావు అని పలువురు వక్తలు కొనియాడారు. సిపిఎం సభ్యులు, రచయిత, సాహీతి స్రవంతి ప్రధాన కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు 2వ వర్థంతిని 61వ వార్డు పరిధి మల్కాపురం గొల్లవీధిలో నిర్వహించారు. నూనెల శ్రీనివాసరావు, సమ్మిడి అన్నమయ్య చిత్రపటాలకు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆధ్వర్యాన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, శ్రీనివాసరావు విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. మల్కాపురం ప్రజలకు అనేక సేవలందించారన్నారు. గొప్ప రచయిత, కార్మిక గీతాలను, ప్రజలను మేల్కొలిపే పాటలు రచించి సాహితీ స్రవంతిలో మంచి కృషిచేశారని కొనియాడారు. శ్రీనివాస్ స్ఫూర్తితో పేదలకు ఇళ్లు వచ్చేవరకు సిపిఎం తరుపున పొరాడతామని స్పష్టంచేశారు. సిపిఎం మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, శ్రీనివాసరావు సూటీగా మాట్లాడేవారని చెప్పారు. ప్రజలు, కార్మికుల సమస్యలను జోడించి పాటలు రాసేవారని తెలిపారు. ఆయన ఆశయసాధనలో మనమంతా నడిచినప్పుడే అసలైన నివాళి అని పేర్కొన్నారు. సిపిఎం జోన్ నాయకులు ఆర్.విమల అధ్యక్షతన జరిగిన వర్థంతి సభలో మల్కాపురంజోన్ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు ఎస్.ప్రసాద్, సాహితీ స్రవంతి విశాఖ జిల్లా కార్యదర్శి పి.రామారావు, ఉరుకూటి బాబూరావు, కుర్మాన సత్తిరాజు, నూనెల మహలక్ష్మి, ఉరుకూటి అప్పారావు, ఎల్లేటి అప్పారావు, వి.బాబూరావు ప్రసంగించారు. త్రినాధపురం విసిసి బాలల కోలాటం, నృత్యప్రదర్శన చూపరలను ఆకట్టుకుంది.










