
ప్రజాశక్తి - కలెక్టరేట్ : తన ఉద్యోగ ప్రస్థానంతోనూ, రిటైర్ అయిన తరువాత సమాజ వికాసానికి చేపట్టిన కార్యక్రమాలతోనూ, తుదకు చనిపోయిన తరువాత తన పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాల విద్యార్థుల పరిశోధన కోసం అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంతోనూ అందరికీ ఆదర్శనీయునిగా యలమంచిలి కృష్ణారావు నిలిచారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటిఐ జాయింట్ డైరెక్టర్ వై.కృష్ణారావు ఉద్యోగ విరమణ చేసి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆత్మీయ కలయిక పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా విశ్రాంత ఐటిఐ ప్రిన్సిపాల్ పరమేశ్వరరావు వ్యవహరించారు. అతిథిగా హాజరైన లోకనాథం మాట్లాడుతూ కృష్ణారావు తన ఉద్యోగ కాలంలో నిజాయితీగా, నిఖార్సుగా పనిచేసి పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ఎన్‌సిఆర్‌టి, ఎస్‌ఇఆర్‌టి సమస్య వచ్చినప్పుడు ఎస్‌ఎఫ్‌ఐగా తాము చేసిన పోరాటానికి తగిన సలహాలు ఇచ్చి ముందుకు నడిపిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం విశాఖలో జరిగిన పోరాటాల్లో తాను పాల్గొనడమే కాకుండా, తన శిష్యులనూ, తోటి ఉద్యోగులనూ భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు. సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ కృష్ణారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఐటిఐలో ఎంతో మంది ఆయన వద్ద విద్యనభ్యసించి ఉన్నతులుగా ఎదిగిన విషయాన్ని గుర్తుచేశారు. కుటుంబం యావత్తునూ మంచి మార్గంలో నడిపించిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఐటిఐ పూర్వ అసిస్టెంట్ డైరెక్టర్ తోడర్‌మల్ మాట్లాడుతూ ఐటిఐల అభివృద్ధికి కృష్ణారావు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ స్కూల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, కవి బొడ్డ కూర్మారావు, ఐటిఐల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులు, పలువురు ప్రిన్సిపాళ్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టు కోడూరు అప్పలనాయుడు రచించిన 'నిత్య శ్రామికుడు.. కృష్ణారావు' పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. రచయిత ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ సత్కరించారు.
దేహదాన అంగీకారపత్రం అందజేత
కృష్ణారావు మరణానంతరం ఆయన పార్థివ దేహాన్ని పరిశోధనల కోసం మెడికల్ విద్యార్థులకు అందజేస్తామంటూ జ్యోతిబసు దేహదాన ప్రోత్సాహ సంస్థ బాధ్యులు ఎం.అన్నపూర్ణకు కృష్ణారావు భార్య స్వరాజ్యరాణి, కుమారుడు వై.సత్యనారాయణ, కోడలు అనురాధ అంగీకారపత్రం అందజేశారు. వారికి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు. దేహదానం ప్రాధాన్యతను సభా వేదికగా వివరించారు.