ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్ : సరికొండ లక్షమ్మ జీవితం ఆదర్శనీయమని రైతు సంఘం నాయకులు గద్దె చలమయ్య అన్నారు. స్థానిక రాజుల కాలినీలో సరికొండ లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన లక్ష్మమ్మ 8వ వర్థంతి సభకు సిఐటియు జిల్లా నాయకులు గుంటూరు విజరుకుమార్ అధ్యక్షత వహించారు. చలమయ్య మాట్లాడుతూ లక్ష్మమ్మ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘాలలో చురుకైన పాత్రను పోషించారని, ఒకవైపు ఆర్థిక భారం వారిని కంగదీస్తున్నా లెక్క చేయక అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఇద్దరు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దారని చెప్పారు. సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబంలో విద్యా ప్రమాణాలు మెరుగు పడాలన్నారు. అయితే నేడు విద్య పేదలకు అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలో పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకునే ఆసక్తి ఉన్నా కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల ఎదుర్కొన్న లక్ష్మమ్మ.. విద్య కోసం పరితపించే పేద విద్యార్థులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తపన పడ్డారని గుర్తు చేశారు. ఆమే ఆలోచనలకు ఊపిరి పోస్తూ అమె వర్ధంతి రోజున ఐదుగురు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. లక్ష్మమ్మ ఆశయాలకు జీవం పోస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. లక్ష్మమ్మ పెద్ద కుమారుడు లెనిన్‌బాబు మాట్లాడుతూ తన తల్లి తమకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు నేర్పించారని, అవే తమకు ఎనలేని సంపదని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వర్‌రెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులునాయక్, అంగన్‌వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి.మల్లీశ్వరి, ఎ.వీరబ్రహ్మం, ఎ.రామయ్య, ఆర్.పురుషోత్తం కుటుంబ సభ్యులు రాజు, చినబాబు, పద్మ, వెంకాయమ్మ, డాక్టర్ సంపత్ పాల్గొన్నారు. ముందుగా లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు ప్రజా సంఘాల నాయకుల ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించారు.










