Feb 28,2023 22:58

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: గ్రంథాలయాల స్థాపనలో విశేష కృషి చేసిన గాడిచెర్ల హరి సర్వోత్తమంరావు జీవితం యువతకు ఆదర్శప్రాయమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధ శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్‌ కుమార్‌ అన్నారు. ఆదర్శ దేశభక్తుడు గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు 63వ వర్థంతి సందర్భంగా నగరంలోని సర్వోత్తమ భవన్‌ నందు సభ మంగళవారం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న కిరణ్‌కుమార్‌ మాట్లాడుతే వందేమాతరం, ఆంధ్రోద్యమం, తదితర ఉద్యమాలలో గాడిచెర్ల వారి వీరోచిత పాత్ర నిరుపమానమని అంటూ మహనీయుల జీవిత చరిత్రలు జాతిని ప్రభావితం చేస్తాయన్నారు. గాడిచెర్ల ఫౌండేషన్‌ అధ్యక్షులు కె. చంద్రశేఖర కల్కురా మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం ప్రజలలో అవిద్య, అజ్ఞానం రుపుమాపడానికి వారు సాగించిన పోరాటాలను ఉద్యమాలను ప్రస్తావించారు. ప్రముఖ సాహితీవేత్త కొప్పర్తి రాంబాబు మాట్లాడుతూ గాడిచెర్ల జీవితం చదివితే ఎంతో ఉద్వేగం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘ ప్రదాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద మాట్లాడుతూ నాడు సాగిన అనేక సాంఘిక, రాజకీయ, సంస్కరణ ఉద్యమాలలో గాడిచెర్ల వారి పాత్ర బలంగా ఉందన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు.