ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఆదర్శ ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి అని, ఆయన జీవితాన్ని ప్రతి ఉపాధ్యాయుడూ స్ఫూర్తిగా తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నాగమణి, జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప తెలిపారు. మంగళవారం ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి 7వ వర్థంతి సందర్భంగా స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో 1938 జనవరి 15న రామిరెడ్డి జన్మించారని తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు సమితి మద్దెలమడుగు గ్రామంలో 1958లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారని చెప్పారు. ఆ నాటి నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. యుటిఎఫ్ ఆవిర్భావం నుంచి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా, అనంతరం రాష్ట్ర అధ్యక్షులుగా 1981 నుంచి 2000ల మధ్య కాలంలో సేవలందించారని చెప్పారు. ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్ స్కేల్‌ను సాధించి పెట్టిన ఘనత ఈయనకే దక్కుతుందన్నారు. నిరాడంబరత, నిజాయితీ, ఆదర్శవంతం కలగలిసిన జీవనశైలి ఆయనదని గుర్తు చేశారు. 1982లో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారని తెలిపారు. 2007లో మళ్లీ ఎమ్మెల్సీగా విజయం సాధించారని చెప్పారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సంఘాలు చేసే పోరాటాలను శాసనమండలి వేదికపై ప్రతిభింభించేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో నేటితరం ఉపాధ్యాయులు పని చేయాలని కోరారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి దేవపాల్, ఆడిట్ కమిటీ సభ్యులు కౌలన్న, మల్లికార్జున, సీనియర్ నాయకులు రాఘవేంద్ర, మాదన్న, కె.నాగరాజు, ఎం.రాజు, లక్ష్మన్న, భాగ్యరాజు, ప్రసాద్, జి.బాబు, నాగేశ్వరరావు, పెద్దారెడ్డి, చిన్న ఎల్లప్ప, మాధవస్వామి పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న యుటిఎఫ్ నాయకులు










