ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మండలంలోని రాయగడ జమ్ము పంచాయితీలోని రాయగడ జమ్ము, గొరడ, పెంగవ, వల్లాడ గ్రామాల్లో జట్టు ట్రస్ట్ నాబార్డ్ సహకారంతో అమలు చేస్తున్న జీవా కార్యక్రమాన్ని నాబార్డు సలహాదారు సతీష్, డాక్యుమెంటర్ హర్ష్ కమాత్ ( గోవా) రెండు రోజుల పాటు సందర్శించి విజయగాధలు సేకరించారు. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ నాలుగు గ్రామాల్లోని రైతుల క్షేత్రాలు సందర్శించి వారి అనుభవాలు, పంటల విధానాలు సేకరించేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ముందుగా రాయగడ జమ్ము గ్రామానికి చెందిన పువ్వుల అనసూయ మాతోట క్షేత్రంలో పంటలను పరిశీలించి వారి విజయగాధను సేకరించారు. మామిడి మొక్కల్లో అంతర పంటలుగా వేసుకున్న వంగ, టమోటా, మిరప, బెండ, చిక్కుడు, కంది, పసుపు, అల్లం, జొన్న, సీమ పెండలం, కర్ర పెండలం, బహువార్హిక మిరప, బంతి, అరటి, బీర, దొండ, చిక్కుడు, అనాస పనస, బత్తాయి, బొప్పాయి, కరివేప, సామలు, కొర్రలు, చోడి, పశుగ్రాసం గడ్డి సాగుతో పాటు నాటు కోళ్ల బ్రీడ్ యూనిట్ ద్వారా కోడి పిల్లల పెంపకాన్ని సందర్శించి వారి ఆదాయ వ్యయాలను డాక్యుమెంట్ చేశారు. అనంతరం జీవా కార్యక్రమంలో భాగంగా పెంగవకు చెందిన పువ్వుల దివాకర్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయ సాగు విధానాలు సేకరించారు. ఇందులో చిరు ధాన్యాలతో మిశ్రమ పంటలు, మామిడి తోటల్లో నువ్వులు, ఉలవలు, కంది, పైనాఫిల్, పసుపు, అల్లం, బహువార్షిక మిరప, నాటు కోళ్ల పెంపకం, అజోల్లా పెంపకం మొదలైన పంటల సాగును వాటి ఆదాయాల వివరాలను తెలుసుకుని సంతప్తిని వ్యక్తం చేశారు. జీడి తోటలో అంతర్ పంటలు సాగు చేస్తున్న రాయగడ జమ్ముకు చెందిన సుందరమ్మను కలిసి జీడిలో అంతర్ పంటల సుసాధ్యాన్ని తెలుసుకున్నారు. సుందరమ్మ ఒంటరి మహిళ అయినప్పటికీ తన భూమి కొరకు అవసరమైన ఘన, ద్రవ జీవామృతాల తయారీని సందర్శించి అభినందించారు. గొరడకు చెందిన తాడంగి బంగార్రాజు మామిడి తోటల్లో సాగు చేస్తున్న శ్రీరాగి, పసుపు, అల్లం, కొండచీపుర్లు, కూరగాయలు, పైనాపిల్‌తో పాటు సుమారు 52 రకాల పంటల సాగు, నాటు కోళ్ల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. ఇదే గ్రామానికి చెందిన అమరావతి సాగు చేస్తున్న దేశీయ వరిశ్రీ సాగు విధానాన్ని అందులో గల లాభాలు, వరి చేను గట్లపై గల వివిధ పంటలను పరిశీలించి వివరాలు సేకరించారు. జీవా కమిటీ సభ్యుడైన కీలక చిరంజీవులు అన్నపూర్ణ పంటల నమూనాలో సాగు చేస్తున్న కూరగాయల సాగును మరియు ఆదాయ వ్యయాలను డాక్యుమెంట్ చేశారు. జీవా కార్యక్రమంలో భాగంగా జట్టు ట్రస్ట్ ఏర్పాటు చేసిన వనరుల కేంద్రాన్ని పరిశీలించి అవి రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే విషయాలను స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాతోట జీవా కమిటీ అధ్యక్షులు తాడంగి జమ్మయ్య, జట్టు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరోజ్ ప్రహారాజ్, జీవా కో ఆర్డినేటర్ ప్రభొదు, రిసోర్స్ పర్సన్ పేకాపు మురళి, ప్రకృతి వ్యవసాయం కార్యకర్తలు పువ్వుల రామారావు, జగదీష్, మన్మథ, సంతోషి, శ్రీహరి, పత్తిక రామారావు, సుబ్రహ్మణ్యం, లింగరాజు, రమేష్, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.