ఎయిడెడ్ యాజమాన్యాలు సగం సొమ్ము సమకూర్చుకొంటే ...సగం సొమ్ము తాను అందించేందుకు కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది. 'ఛాలెంజ్ ఫండ్' పేరుతో కోట్లాది నిధుల్ని కేటాయించింది. యాజమాన్యాలు కూడా-మరీ ముఖ్యంగా ఒంటరి యాజమాన్యాలు దీనికి ముందుకొచ్చాయి. ఇలా జరక్కపోతే ఏమయ్యేది? ఎయిడెడ్ విద్యాసంస్థలు వందలాదిగా మూతబడేవి. వాటి స్థానంలో ప్రభుత్వ పాఠశాలలుండవు గనక ప్రైవేటు విద్య విజృంభించేది. ఎయిడెడ్ విద్యాసంస్థలు పేదపిల్లలకు ఒక బాధ్యతగా విద్యనందిస్తున్నాయనీ, అవి ప్రైవేటు వ్యాపార విద్యాసంస్థలకు పోటీగా నిలుస్తున్నాయనీ ప్రభుత్వం అంగీకరించబట్టే ఇది సాధ్యమైంది. దీనికి భిన్నంగా రాజస్థాన్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థలన్నిటినీ మూసెయ్యడంతో ఏం జరిగింది? ప్రైవేటు సంస్థల పంట పడింది. పేదలకు వెన్ను విరిగింది. మన రాష్ట్రం నడుస్తున్నది ఈ దారిలోనే !
కేరళ విద్యారంగాన్ని గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? అని చాలామంది అనుకోవచ్చు. కానీ కేరళ ప్రత్యేకత ఏమంటే అది ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాల్ని చేస్తూనే వుంటుంది. ఎప్పుడూ వెనకబడి పోకుండా జాగ్రత్తపడ్డమే గాదు మరింత వినూత్నంగా వుండేందుకు కాలానుగుణంగా మారేందుకు ప్రయత్నిస్తూనే వుంటుంది. దీనికనుగుణంగా ఇప్పుడు కేరళలో ఏం జరుగుతోందో చూద్దాం.
మారుతున్న సామాజికార్థిక పరిస్థితులు కేరళకు కూడా విద్యారంగంలో సవాళ్ళు విసురుతున్నాయి. అందులో ప్రధానమైంది గల్ఫ్ నుంచి వస్తున్న నిధులతో కళ్ళు మిరుమిట్లు గొలిపే భవనాలతో, హంగులతో ప్రైవేటు పాఠశాలలు రావడం. అలాగే కేరళ దాదాపు మధ్య తరగతి రాష్ట్రం. వారి ఆకాంక్షలు నిరంతరం పెరుగుతుంటాయి. ఆధునిక విద్య కోసం కేరళ ఎప్పుడూ తహతహ పడుతుంటుంది. ప్రపంచమంతా తిరుగుతున్న కేరళీయులు తమ రాష్ట్రంలోనూ అంతర్జాతీయంగా పోటీ పడే విద్యాలయాలు వుండాలని కోరుకోడం సహజం. దీనికనుగుణంగా విద్యా వ్యవస్థను ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మార్చుకోడం, దానికితగ్గ రాజకీయ దార్శనికతను ప్రదర్శించడం కేరళకు అవసరం.
'పోతు విద్యాభ్యాస సంరక్షణ యజ్ఞమ్'
కేరళలో 2607 ప్రాథమిక, 1111 ప్రాథమికోన్నత, 1296 ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ రంగంలో వున్నాయి. చారిత్రకంగా ఇవి బలమైనవి. తరగతికొక టీచరు, తరగతికొక గదిలేని ఒక్క ప్రాథమిక పాఠశాల కూడా కేరళలో లేదు. దేశంలో కేరళకు మాత్రమే ఈ గౌరవం వుంది. ఎప్పటికప్పుడు టీచర్ల పోస్టులు భర్తీ చెయ్యడం, బోధనా విధానాల్ని పాఠ్యగ్రంథాల్ని ఆధునీకరించడం, పంచాయితీల సహకారం, తల్లిదండ్రుల భాగస్వామ్యం లాంటివి చాలా బలమైన విద్యావ్యవస్థనిక్కడ నెలకొల్పాయి. కానీ మారుతున్న కాలానికిది చాలదు.
అందుకని పెద్ద ఎత్తున పాఠశాలలన్నిటినీ ఒక క్రమంలో అత్యాధునికంగా తీర్చిదిద్దాలని 2017-18లో వామపక్ష ప్రభుత్వం సంకల్పించింది. శాసనసభ్యుడిగా వున్నప్పుడు తన నియోజక వర్గంలో అంతర్జాతీయ స్థాయి హంగులతో ఒక ప్రభుత్వ పాఠశాల రూపురేఖల్నే మార్చేసిన అనుభవం విద్యామంత్రి రవీంద్రన్‌కు వుంది. ఇలా రూపుదిద్దుకొన్నదే 'పోతు విద్యాభ్యాస సంరక్షణ యజ్ఞమ్'. ప్రభుత్వ పాఠశాలల్ని అత్యాధునీకరించే మహోద్యమమిది.
దీనికనుగుణంగా మొదట అన్ని ప్రధాన కేంద్రాల్లో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలుగా 250 ఉన్నత పాఠశాలల్ని ఆధునీకరించారు. వీటికి ఒక్కొక దానికి రూ.5 కోట్లు వెచ్చించారు. ఇవి ప్రపంచ ప్రమాణాలున్న పాఠశాలలు. ''ప్రభుత్వ విద్యా పునరుజ్జీవనోద్యమంలో'' (పిఇఆర్‌సి) భాగంగా ఇలాంటి-1000 స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మిగిలిన పాఠశాలలకివి వనరుల కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి! ఇప్పటికే మంచి వసతులున్న పాఠశాలలను రెండవ శ్రేణిగా గుర్తించి వీటికి మూడు కోట్లు కేటాయించారు. తొలి దశలో ఇలాంటివి 395 ఎంపిక చేశారు. ఇక చిన్న పాఠశాలలుగా వున్న 446 తృతీయ శ్రేణి పాఠశాలలకు రూ.కోటి వంతున వెచ్చించారు. తొలి దశలో 2017-18లో దీనికి రూ.3129 కోట్లు ఖర్చయింది. కొత్త విశాలమైన భవనాలు నిర్మించడం, ప్రతి తరగతి గదినీ ఆధునిక అవసరాలకు తగ్గట్టు మార్చడం, పిల్లలకు వసతులు కల్పించడం లాంటివి ఇందులోని ముఖ్యాంశాలు. తర్వాత వరుసగా అన్ని పాఠశాలలకు దీన్ని వర్తింపజేస్తున్నారు. మన రాష్ట్రం చేపట్టిన 'నాడు-నేడు' కిది పూర్తిగా భిన్నమైంది.
దీని కోసం ప్రజల్ని, ప్రవాస కేరళీయుల్ని, దాతల్ని ఒక ఉద్యమంగా కూడగట్టడం, తమ ఊరిబడి కోసం ఊరు మొత్తాన్ని కలించడం కేరళకు మాత్రమే సాధ్యమన్పిస్తుంది. దీనివల్ల అంచనా వ్యయంలో నాల్గవ వంతు తగ్గిందని ప్రభుత్వం చెపుతోంది! ఇప్పుడు కేరళ స్కూళ్ళు ఉన్నత మధ్య తరగతినీ ఆకర్షిస్తున్నాయి. కొత్తగా 6.79 లక్షల మంది పిల్లలు వీటిలో చేరారు. ఈ పెరుగుదల కరోనాకు ముందటిది. కరోనా కాలంలో దేశమంతా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు పెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో అందరికంటె ఎక్కువ పెరిగారు. దీనికి కారణం దిగువ మధ్యతరగతి కూడా ఆర్థికంగా చితికిపోయి ప్రభుత్వ పాఠశాలల్ని ఆశ్రయించడం. అన్ని పాఠశాలలు కరోనాతో మూతబడ్డంతో ఫీజుల్లేని ప్రభుత్వ పాఠశాలకు తరలి వెళ్ళడం మేలని తల్లిదండ్రులు భావించడం. ఈ పెరుగుదలకూ, కేరళ పెరుగుదలకూ పోలికే లేదు. దేశంలో పాఠశాల స్థాయిలోనే బడి మానేస్తున్న పిల్లలు (2019-20లో) 17.06 శాతం కాగా కేరళలో కేవలం 0.11 శాతం గావడం యునిసెఫ్‌ను సైతం నివ్వెరపరిచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో కూడా ఈ ప్రమాణం లేదు !
హైటెక్ తరగతి గదులు
కేవలం భవనాలతో, సదుపాయాలతో సరిపెట్టక కేరళ 45,000 తరగతి గదుల్ని హైటెక్‌గా మార్చింది. హైటెక్స్ లాబ్స్ 11000 నిర్మించింది. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కెఐటిఇ) పేర ఇదొక ఉద్యమంగా సాగింది. ఇప్పుడు కేరళలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ సాంకేతిక వ్యవస్థ లేని తరగతి గది ఒక్కటీ లేదు! డిజిటల్ విద్యా సౌకర్యాలు లేని ఒక్క ప్రాథమిక పాఠశాల కూడా లేదు. ఊహకు కూడా అందని అద్భుతమిది. ఇదంతా కరోనా వచ్చేటప్పటకి పూర్తి కావడం విశేషం. దీనికోసం రూ.793.50 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.599 కోట్లతోనే పూర్తిచేసినట్టు మిగిలిందంతా ప్రజలే భరించినట్లు కేరళ సగర్వంగా చెపుతోంది.
''కేరళలో కరోనా కాలంలో 90 శాతం పిల్లలకు అభ్యసనాభివృద్ధి ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరిగింది. ఆన్‌లైన్‌లో విద్యార్థులు తొంబై శాతం దాకా ఉపాధ్యాయులతో సంభాషిస్తూ అభ్యసనం చేశారు'' అని యునిసెఫ్ ప్రశంసిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ''ఒక్క రోజూ మా విద్యార్థుల అభ్యసనం ఆగలేదు. ఒక్క విద్యార్థీ బడి మానలేదు'' అని ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల్లో సైతం డిజిటల్ విద్యను అప్పటికే పిల్లలకు పరిచయం చేసివున్నందువల్ల ఆన్‌లైన్ చదువుల్లో వాళ్ళేమీ తికమకపడే అవసరమే లేక పోయింది. 'ఫస్ట్ బెల్' విద్యా ఛానల్ పాఠాల్ని యూట్యూబ్‌లో 54 లక్షల మంది విద్యార్థులు నిత్యం విన్నారు. మరీ ఆశ్చర్యకరమేమంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థులు సైతం వీటినే విన్నారు. ప్రవాస మలయాళీలకు కూడా ఇవి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ప్రపంచమంతా 'డిజిటల్ డివైడ్' గురించి భయపడుతుంటే కేరళ దీన్ని డిజిటల్ సమానతగా అభివర్ణిస్తోంది.
రెండేళ్ళు కరోనాతో మన విద్యార్థులు అంతా మరిచిపొయ్యారని, పరీక్షలే జరపలేక పొయ్యామని మనం బేలమొగం పెట్టుకొని దిగాలు పడుతుంటే కేరళను కరోనా ఎంత అతలాకుతలం చేసినా రెగ్యులర్‌గా పబ్లిక్ పరీక్షలు జరిగాయి.
అక్టోబరు 2020 నాటికే కేరళ లోని మొత్తం 16,027 పాఠశాలల్లో, 3,74,274 డిజిటల్ డివైసెస్‌తో 1,83,443 మంది ఉపాధ్యాయులూ, 41 లక్షల మంది విద్యార్థులూ ఈ అత్యాధునిక విద్యకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ప్రపంచమంతా 'డిజిటల్ చదువులు', 'అన్‌లైన్ పాఠాలు' అంటూ ఒక వ్యాపార సామ్రాజ్యం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. దీనికి విరుగుడుగా కేరళ ప్రభుత్వం 'ఫ్రీ సాఫ్ట్‌వేర్'ను ఆశ్రయించింది. ఫలితంగా తమకు రూ. 3000 కోట్లు ఆదా అవుతున్నట్టు విద్యాశాఖ మంత్రి గారే ప్రకటించారు. ఇలాంటి రాజకీయ దృక్పథాన్ని ఒక్క వామపక్ష ప్రభుత్వం తప్ప ఈ రోజుల్లో ఎక్కడైనా ఆశించగలమంటారా?
ఎయిడెడ్ సంస్థలకూ మహర్దశ
కేరళలో చారిత్రకంగా వెలిసిన ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆ రాష్ట్ర విద్యాభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికీ 3376 ప్రాథమిక, 2379 ప్రాథమికోన్నత,1438 ఉన్నత పాఠశాలలతో వాటిదే అగ్రస్థానం. కానీ ప్రైవేటు పాఠశాలలు విస్తరించడంతో ఇవి దెబ్బతినడం మొదలైంది. ఒకే పాఠశాలను నడిపే (సింగిల్) యాజమాన్యాలు ఆర్థిక స్తోమత లేక కాలానుగుణంగా వీటిని ఆధునీకరించలేక పోసాగాయి. పేద విద్యార్థులకు ఇదొక శాపంగా మారింది. కేరళ పరిస్థితుల దృష్ట్యా వీటిన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోడం సాధ్యంగాదు. 'మరేం చెయ్యాలి' అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి పరిష్కారం ఎయిడెడ్ పాఠశాలల ఆధునీకరణకు కూడా సర్కారు నిధులు సమకూర్చడమేనని ప్రభుత్వం భావించింది. ఇది ఎప్పుడూ ఎక్కడా ఎరగని విధానం. న్యాయపరమైన చిక్కులూ దీనికి సవాలక్ష వుంటాయి. ప్రభుత్వ జోక్యం పెరుగుతుందని యాజమాన్యాలు కూడా దీనికంగీకరించవు. అయినా ఈ సవాళ్ళనన్నిటినీ స్వీకరిస్తూనే ఎయిడెడ్ యాజమాన్యాలు సగం సొమ్ము సమకూర్చుకొంటే సగం సొమ్ము తాను అందించేందుకు కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది. 'ఛాలెంజ్ ఫండు' పేరుతో కోట్లాది నిధుల్ని కేటాయించింది. యాజమాన్యాలు కూడా-మరీ ముఖ్యంగా ఒంటరి యాజమాన్యాలు దీనికి ముందుకొచ్చాయి. ఇలా జరక్కపోతే ఏమయ్యేది? ఎయిడెడ్ విద్యా సంస్థలు వందలాదిగా మూతబడేవి. వాటి స్థానంలో ప్రభుత్వ పాఠశాలలు వుండవు గనక ప్రైవేటు విద్య విజృంభించేది. ఎయిడెడ్ విద్యాసంస్థలు పేదపిల్లలకు ఒక బాధ్యతగా విద్యనందిస్తున్నాయనీ, అవి ప్రైవేటు వ్యాపార విద్యాసంస్థలకు పోటీగా నిలుస్తున్నాయనీ ప్రభుత్వం అంగీకరించబట్టే ఇది సాధ్యమైంది. దీనికి భిన్నంగా రాజస్థాన్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థలన్నిటినీ మూసెయ్యడంతో ఏం జరిగింది? ప్రైవేటు సంస్థల పంట పడింది. పేదలకు వెన్ను విరిగింది. మన రాష్ట్రం నడుస్తున్నది ఈ దారిలోనే!
(రెండవ భాగం తదుపరి సంచికలో)
/ వ్యాసకర్త : పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీ /
వి. బాలసుబ్రహ్మణ్యం











