
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : సింహాద్రి మహేశ్వరరెడ్డి ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, సీనియర్ నాయకులు జైవి రాఘవులు అన్నారు. మండలంలోని కాజా సిపిఎం కార్యాలయంలో సింహాద్రి మహేశ్వరరెడ్డి 13వ వర్ధంతి సభ ఆదివారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభకు టి.ప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అప్పారావు మాట్లాడుతూ గ్రామంలో 50 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీని ఆదర్శంగా నిలపడంతో మహేశ్వరరెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. యువతను ఐక్యం చేయడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించేవారని, సంక్రాంతి సందర్భంగా యువతను సమీకరించడంలో ఆయన పాత్ర కీలకంగా ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్య అవసరాల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. సామాన్యుల జీతాలు మాత్రం పెరగడం లేదని ఆకాశాన్ని అందుతున్న ధరలతో ఆర్థిక సంక్షోభంతో పేదల జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు. మణిపూర్ దారుణాలపై కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలతో పాటు జనసేన అంటకాగుతున్నాయని దుయ్య బట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు అమలు చేయని, రాజధాని, పోలవరానికి నిధులివ్వని, కడప ఉక్కుకు సహకారం అందించని బిజెపికి ఆ మూడు పార్టీలు ఎందుకు వంతపాడు తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచారని ట్రూఅప్, సర్ ఛార్జీల పేరుతో భారాలు మోపుతున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జెవి రాఘవులు మాట్లాడుతూ 9వ తేదీన కాజాకు సిపిఎం బస్సు యాత్ర రానున్నదని, 15న తేదీన విజయవాడలో ప్రజారక్షణ భేరి బహిరంగ సభ ఉంటుందని, వీటిని జయప్రదం చేయాలని కోరారు. సభలో నాయకులు అధ్యక్షత వహించారు. బి.కోటేశ్వరి, ఈదా ప్రతాపరెడ్డి, ఆదిశేఖర్, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.