ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని రైతులను నమ్మించారు. అనేక ఒడిదుడుకులకు లోనై సాగు చేసిన శనగ పంటను కొనుగోలు చేస్తామని పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు, ఇంకొల్లు, జె పంగులూరు మండలాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర శనగలకు రూ.5,335 ప్రకటించారు. అక్కడక్కడ వచ్చి కొనుగోలు చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందో ప్రైవేటు వ్యాపారులు కూడా రూ.5,000కు కొనుగోలు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులకే కొనుగోలు కేంద్రాలు మూసి వేయటంతో ప్రైవేటు వ్యాపారులు కూడా మార్కెట్‌లో రూ.4,300 నుంచి రూ.4,400 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాకు రూ.500 వరకు రైతు నష్టపోతున్నారు. ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు రైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వం శనగలు నిరంతరం కొనుగోలు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇదిలా ఉండగా మొక్కజొన్న పంట చేతికి వచ్చే నాటికి క్వింటా రూ.2 వేలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మొక్కజొన్న రూ.1,750కి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,960. అయితే మద్దతు ధరకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రైతులకు ఖర్చులు పెరిగి అధిక పెట్టుబడులు పెట్టారు. విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు మాదే బాధ్యత అని ప్రభుత్వం ప్రగల్బాలు పలికింది. గ్రామ గ్రామానికి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. కానీ ఆచరణలో ఇది జరగటం లేదు. మద్దతు ధరకంటే 210 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే లాభం కానరాని పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలను రంగంలోకి దింపి మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కానీ మొక్కజొన్న రైతులకు మేలు చేకూరదు. బడ్జెట్‌లో కేటాయించిన ధరల స్థిరీకరణ నిధులు విడుదల చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో పంట నష్ట పరిహారం కోసం రూ.2,600 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నేటికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు, తుఫానుకు పంట పంట నష్ట పోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.










