ప్రజాశక్తి - ఏలూరు
ఆడ పిల్లల జనన నిష్పత్తిని పెంచడం, విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆదర్శ జిల్లాగా నిలపాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో మహిళా శిశుసంక్షేమశాఖ, మిషన్ శక్తి ఆధ్వర్యంలో బేఠీ బచావో-బేఠీ పడావో కార్యక్రమ వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథి ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ బేఠీ బచావో-బేఠీ పడావో కార్యక్రమం మన జిల్లాకు ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీ పరిధిలో జనన, మరణాల నమోదును రిజిష్టరులో పొందుపర్చుతున్నారని, దీని ఆధారంగా ప్రతినెలా ఈ డేటాను సేకరించి దీన్నిబట్టి ఆడపిలల నిష్పత్తి ఎక్కడ తక్కువగా ఉందో గుర్తించవచ్చని అన్నారు. స్కానింగ్ సెంటర్లలో అబార్షన్ చేసే డాక్టర్లను గుర్తించాలని, వారిపై చట్టప్రకారం కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు. స్కూళ్లు, కాలేజీల్లోనూ బాలికల డ్రాప్‌వుట్స్ లేకుండా చూడాలన్నారు. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ప్రతి పాఠశాలలోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు ఆడ పిల్లలను పుట్టనిద్దాం-ఆడ పిల్లలను రక్షిద్దాం-ఆడ పిల్లలను చదివిద్దాం అనే సందేశాన్ని జిల్లావ్యాప్తంగా ఆవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆడపిల్లను పుట్టనిద్ధాం-ఆడపిల్లను రక్షిద్దాం-చదివిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. మిషన్ శక్తి ప్రోగ్రాం పరిపాలనాధికారి నిర్మల మాట్లాడుతూ ఉజ్వల స్కీమ్, వన్‌స్టాప్ సెంటర్, వీడియో కాన్ఫరెన్స్, నారీ అదాలత్, శక్తిసదన్, విడోస్ తదితర అంశాలపై వివరిం చారు. కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జెడ్‌పి సిఇఒ రవికుమార్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ డి.ఆశా, డిఇఒ రవిసాగర్, ఐసిడిఎస్ పీడీ పద్మావతి, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, ఏలూరు కార్పొరేషన్ కమిష నర్ ఎస్.వెంకటకృష్ణ, డిపిఒ మల్లికార్జునరావు, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదనరావు, డిసిపిఒ సూర్యచక్రవేణి, కాలేజీ ప్రిన్సిపాల్స్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.










