ప్రజాశక్తి - ఆదోని
తాళం పడిందంటే చాలు దొంగలు రెచ్చిపోయి ఇళ్లను లూటీ చేస్తున్నారు. ఆదోని పట్టణంలో రోజురోజుకూ దొంగతనాలు పెరుగుతూనే ఉన్నాయి. పట్టణంలో ఏదో ఒకచోట రోజూ దొంగతనం జరుగుతూనే ఉంది. పట్టణ శివారులో నివాసం ఉంటున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే ఇంటిని దొంగలు గుళ్ల చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
పట్టణ ఆవాసాలు పెరిగిపోవడంతో ప్రభుత్వాలు కూడా పట్టణంలో మూడు సర్కిల్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో సిబ్బందిని, సిఐలను, ఎస్‌ఐలను నియమించాయి. అలాగే రోజూ చుట్టుపక్కల ఉన్న ఆదోని తాలూకా, ఇస్వీ, పెద్దతుంబలం, ఆస్పరి, కౌతాళం తదితర ప్రాంతాల పోలీసు సిబ్బంది సైతం రాత్రి పూట గస్తీకి బందోబస్తు విధులు కేటాయిస్తున్నారు. రాత్రిపూట దొంగతనాలు జరగకుండా ముమ్మరంగా పోలీసు గస్తీ నిర్వహించాలని జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా ఆదోని డివిజన్ పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గతంలో ఉన్న పోలీసు సబ్ డివిజన్‌లో ప్రస్తుతం కేవలం ఆదోని నియోజకవర్గానికి మాత్రమే ఒక డీఎస్పీ ఉండే విధంగా ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుని నియామకాలు కూడా చేపట్టింది. మొన్నటి వరకు ఆదోని పోలీసు సబ్ డివిజన్‌లో ఉన్న ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఎమ్మిగనూరులో పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసి డీఎస్పీని కూడా నియమించారు. అలాగే కొత్తగా ఏర్పడిన పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో కూడా డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ కూడా డీఎస్పీని నియమించారు. మొన్నటి వరకు ఆదోని పోలీసు డివిజన్‌లో ఉన్న ఆలూరు నియోజకవర్గాన్ని పత్తికొండ రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని పోలీసు సబ్ డివిజన్‌లోకి మార్చారు. ఆదోని నియోజకవర్గంలోని ఆదోని పట్టణం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతోపాటు ఆదోని తాలూకా సర్కిల్ పోలీసు స్టేషన్, పోలీసు కంట్రోల్ రూమ్ పరిధిలో ఉన్నాయి. పోలీసు అధికారులు సిబ్బంది విధుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి ఉంచేందుకు ఆదోని నియోజకవర్గానికి ప్రభుత్వం ఒక డీఎస్పీని నియమించింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఆదోనిలో మాత్రం దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అలాగే పోలీసు శాఖకు సంబంధించిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలోనూ పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. పోలీసు శాఖకు సవాలుగా ఉండే దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని, గస్తీలు నిర్వహించడం లేదని ప్రజలు, దొంగతనాల బారిన పడిన బాధితులు వాపోతున్నారు. పోలీసులకు వాహనాలపై చలానాలు విధించడం, జరిమానాలు విధించడంపై ఉన్న శ్రద్ధ దొంగతనాలను అరికట్టడంలో ఉండడం లేదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈనెల 5న సోమవారం అర్ధరాత్రి మళ్లీ దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఏకంగా పట్టణ శివారులోని శిరుగుప్ప టర్నింగ్‌లో ఉన్న నాలుగు దుకాణాలకు దొంగలు కన్నం వేసి నగదు, సామగ్రిని ఎత్తుకెళ్లారు. పట్టణంలోని శిరుగుప్ప చెక్‌పోస్టు సమీపంలో ఇమ్రాన్ ఐరన్ మార్ట్ దుకాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు దుకాణానికి ఉన్న రేకుల షెడ్డును తొలగించి లోపలికి వెళ్లి, పెట్టెలో ఉంచిన రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిపోయారని బాధితుడు ఇమ్రాన్ వాపోయారు. ఇమ్రాన్ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన ముఖానికి కర్చీప్ కట్టుకొని నగదు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో నమోదైంది. అలాగే ఆ ప్రాంత సమీపంలో ఉన్న మహాలక్ష్మి ఆటో మొబైల్స్ దుకాణంలోనూ వెనుక వైపు నుంచి రేకుల షెడ్డును తొలగించి పెట్టెలోని రూ.3,500 ఎత్తుకెళ్లినట్లు బాధితుడు రవికుమార్ తెలిపారు. పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాల మెకానిక్ షెడ్డులో రూ.15 వేల విలువ చేసే పరికరాలు చోరీ చేశారని బాధితుడు హుస్సేన్ వలీ పేర్కొన్నారు. రాయనగర్ సమీపంలో ఉన్న పటేల్ ఐరన్ మార్ట్ దుకాణంలోనూ దొంగ చొరబడి పెట్టెలో ఉంచిన రూ.6 వేలు ఎత్తుకెళ్లారని దుకాణ నిర్వాహకుడు పేర్కొన్నారు. ఒకే రోజు నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. ఒకేరోజు ఒకే ప్రాంతానికి చెందిన నాలుగు దుకాణాల్లో చోరీ జరగడంతో పట్టణ శివారు ప్రాంతాల్లోనూ, పట్టణంలోనూ దుకాణ యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మాత్రం షరామామూలే అన్నట్లుగా 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరాలను పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఘటన జరిగిన రాత్రి పూట ఈ ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారా లేదా అనే విషయంపై పోలీసు అధికారులు విచారించాలని పలువురు కోరుతున్నారు. రాత్రిపూట పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేసి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పుర ప్రజలు కోరుతున్నారు.
ఆదోనిలో రెచ్చిపోతున్న దొంగలు...










