May 02,2023 19:34

బాధ్యతలు తీసుకుంటున్న ఆదిరాజ్‌ రాణా

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని డివిజన్‌ కేంద్రానికి ఎఎస్పీగా ఇటీవలే ఆదిరాజ్‌ రాణాను ప్రభుత్వం నియమించింది. ఉత్తర్వుల మేరకు మంగళవారం ఉదయం ఆయన ఆదోని ఎఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సిఐలు శ్రీరామ్‌, శ్రీనివాస్‌ నాయక్‌, మహేశ్వర్‌ రెడ్డిలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రికార్డులో సంతకం చేసిన, అనంతరం పరిచయ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా శాంతిభద్రతల పరిరక్షణలో తారతమ్యాలు లేకుండా విధులు నిర్వహిస్తామని మీడియాకు వివరించారు.
నియామకం నిలిపేశారు..?
ఆదోని డీఎస్పీ కార్యాలయంలో ఎఎస్పీగా ఆదిరాజ్‌ రాణా బాధ్యతలు చేపట్టిన గంటలోనే నియామకం నిలిపివేసినట్లు ఉత్తర్వులు వచ్చాయని సమాచారం. ఉన్నపలంగా కార్యాలయం నుంచి వెనుతిరిగినట్లు పోలీసులు తెలిపారు. ఐపిఎస్‌ అధికారి బాధ్యతలు చేపట్టడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట, శాంతి భద్రతల పరిరక్షణ మెరుగుపడుతుందని ప్రజలు భావించారు. ఎఎస్పీ స్థాయి అధికారి డివిజన్‌ కేంద్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తే తమ రాజకీయ ప్రాబల్యానికి ఆటంకంగా ఉంటుందని, తమ మాట చెల్లుబాటు కాదని, ఎమ్మెల్యేలు తమ ఆక్రోశాన్ని వెలగక్కినట్లు తెలిసింది. ఆయన ఇక్కడికి రాకమునుపే ఐపిఎస్‌ అధికారి బదిలీకి ముందుగానే సన్నాహాలు జరిపినట్లు వినికిడి. ఉన్నపలంగా నియామకం రద్దు ఉత్తర్వుల వెల్లడి పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారిని ఇక్కడికి డీఎస్పీగా వేయించుకునేందుకు ఎమ్మెల్యేలు విజయవాడలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎక్కడికి ఎవరిని కేటాయిస్తారో ఉన్నతాధికారులు ప్రకటించాల్సి ఉంది. అధికారుల విధి నిర్వహణలో రాజకీయ నాయకుల పెత్తనం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనే నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఎఎస్పీ స్థాయి అధికారిని గంటలోనే నియామకం రద్దు వెల్లడి పట్ల జిల్లాలో పలు విమర్శలకు దారి తీసింది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.