ప్రజాశక్తి - ఆదోని
అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదోనికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధికి పాటుపడాలని సిపిఎం నాయకులు కోరారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, వెంకటేష్, శ్రీను, శేఖర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కర్నూలు నగరానికి, ఆదోని పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉందని, ఇక్కడి నుంచి అక్కడ ఆస్పత్రికి వెళ్లాలంటే చాలా వ్యయంతో కూడుకున్నదని తెలిపారు. ఆదోని చుట్టుపక్కల సుమారు నాలుగు నియోజకవర్గాలకు కేంద్రంగా ఉందన్నారు. ఆదోని ఆస్పత్రిని జిల్లాస్థాయికి అప్ గ్రేడ్ చేసి సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, బెడ్ల సంఖ్య, డాక్టర్లు, నర్సుల సంఖ్య పెంచి ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదోని పట్టణం రైల్వే ట్రాక్ మీద ఉన్న పాత బ్రిడ్జి పూర్తిగా పాడైపోయిందని, పెద్ద వాహనాలు తిరగకుండా నిషేధించినప్పటికీ బ్రిడ్జి ఏ సమయలోనైనా కూలిపోయి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. గ్రామాల నుంచి వచ్చే పాదచారులకు ఏదైనా నష్టం సంభవించే అవకాశం కూడా ఉందని, మరమ్మతులు చేపట్టాలని కోరారు. రేణుకాంబ హోటల్ దగ్గర మెట్లెక్కే ఫుట్ ఓవర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. పట్టణంలో కేవలం రెండు మాత్రమే హైస్కూళ్లు ఉన్నాయని, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని పెంచాలని కోరారు. పట్టణ జనాభా పెరుగుతున్నందున నీటి కొరత ఏర్పడకుండా అదనపు ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మించాలని తెలిపారు. మండలంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో రక్షిత మంచినీరు అందే పరిస్థితి లేదని, తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడిందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గానికి సాగునీరు సౌకర్యం తక్కువగా ఉందని, ఆదోని శివారు కొండల పరిసర ప్రాంతాల్లో రిజర్వాయర్ నిర్మించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆదోని పట్టణ, గ్రామీణ భూముల విలువ పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భరించలేని పరిస్థితి ఉందన్నారు. భూములు విలువను యథాతధంగా కొనసాగించాలని కోరారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని, పోలీసు ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేసి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిశీలిస్తామని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు.
మంత్రి బుగ్గనకు సమస్యలు విన్నవిస్తున్న నాయకులు










