'ఉడుతను పెంచాను పారిపోయింది. చిలుకను పెంచాను ఎగిరిపోయింది. చెట్టుని పెంచాను రెండూ తిరిగి వచ్చి, చెట్టు మీద చేరాయి' దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పలుకులివి. ఇంటి ముందు మొక్కలుంటే తూనీగలు, తుమ్మెదలు, పక్షులు, ఉడుతలు, కోతులు వంటి ఎన్నో జీవులు వాటి మీద చేరి మనకు కనువిందు చేస్తాయి. అదో అద్భుత ప్రపంచంలా మనల్ని మైమరిపింపజేస్తాయి. ఏ రకం మొక్కలు, చెట్లు ఇంటి ముందు ఉంటే ఏఏ జీవులకు అవి ఆవాసంగా ఉంటాయో తెలుసుకుందాం..
పక్షులు, జీవులు ఇంటి ముందుండే చెట్లపై నివాసముంటూ సేదతీరుతూ మనకు కనువిందు చేస్తాయి. అలాంటి ఎన్నో పక్షుల, జీవుల పరిచయం నేడు..
ఉడుతకు నోరూరించే జామ
తీయని జామ పండ్లంటే ఉడుతకి ఎంతో ఇష్టం. అందుకే ఇంటి పెరట్లో జామ చెట్టు ఏ మూలన నాటినా ఆ ఇంటికి ఉడుతలు అతిథులైపోతాయి. జామపండ్లను ముద్దుముద్దుగా ఆరగిస్తూ మనల్ని కనువిందు చేస్తూంటాయి. మధ్యమధ్యలో చక్కగా లయబద్ధంగా అరుస్తూ మైమరిపిస్తాయి. జామలో ఒకప్పటిలా కాకుండా కుండీల్లో పెంచుకునే హైబ్రీడ్ మొక్కలూ అందుబాటులోకి వచ్చేశాయి. తైవాన్ జామ వంటి రకాలు కేవలం ఐదడుగుల ఎత్తులో కుండీల్లోనూ కాపు కాస్తాయి. వాటి లోపల ఎర్రగా ఉండే గుజ్జు మధురంగా ఉంటుంది. అంతేకాదండోరు! జామ పండ్లంటే కోతులకీ ఇష్టమే. అందుకే అప్పుడప్పుడు వానరాలూ వస్తుంటాయి. కాబట్టి జాగ్రత్త సుమా!
చిలుకపలుకులన్నీ మధుర మామిడికి
ఎన్ని ఫలాలున్నా చిలుకపలుకులన్నీ మామిడి పండ్ల కోసమే. చిలుకలకి మామిడి అంటే మహాప్రియం. అందుకే సీజన్ ఎప్పుడొస్తుందా? అంటూ ఏడాదంతా ఎదురుచూస్తాయి. చెట్టున పక్వానికి వచ్చిన కాయల్ని మనకంటే ముందుగా రుచి చూసేది ఆ పచ్చని పక్షులే. ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఆకుపచ్చని ఆకుల్లో దూరిపోయి, పండ్లను ఆరగించే చిలుకలు చక్కటి పలుకులతో మనల్ని అలరిస్తుంటాయి. మనం నిత్యం ఇంట్లో చిలుకలు చూడాలనుకుంటే అన్నివేళలా కాపు కాసే పునాస వంటి మామిడి రకాలను పెంచుకోవాల్సిందే.
బొప్పాయి తీయదనం కోయిలరాగం
శ్రావ్యమైన కోయిల రాగం మనసారా వినాలనుకుంటే మన ఇంట్లో బొప్పాయి చెట్టు ఉండాల్సిందే! పండిన బొప్పాయి పళ్ళను పసందుగా ఆరగించి, మనకి గాన విందు చేస్తుంది. కోయిలతో పాటు గోరింక పక్షులూ బొప్పాయి పళ్ళ కోసం ఎదురుచూస్తుంటాయి. అందుకే ఎప్పుడు పండు పక్వానికి వస్తుందా? అని చెట్ల చుట్టూనే ప్రదక్షణ చేస్తూ ఉంటాయి. ఇంటి పెరట్లో బొప్పాయి మొక్క ఉంటే పక్షులు చక్కగా చెట్టు మీద వాలి, సరికొత్త పువ్వుల్లాగా మొక్కకు మరింత అందాలు అద్దుతాయి.
బంగారు పిట్టలకు గూడు వెదురుబిడిం
ఎక్కువమంది వెదురు పొదలను ఇంటి పెరట్లోనూ, కుండీల్లోనూ పెంచుకుంటారు. వాటి కొమ్మల చిగుళ్ళకు చిన్ని చిన్ని గూళ్ళు కట్టుకుని, రంగురంగుల బంగారు పిట్టలు అందంగా అలరిస్తాయి. ఇవి పిచ్చుకల కంటే చిన్నగా ఉండి, చెట్టు మీద వాలి ఉంటే బంగారు పసుపు రంగులో మరింత అందంగా ఉంటాయి.
పసుపు బాకా తేనె పెట్టెలో కాక
పసుపు బాకాలు లేదా పసుపు గంటలు అనే పేరుతో పిలిచే మొక్క పసుపు రంగు పూలను గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఈ పూలలో మకరందం ఉండటంతో తేనె పిట్టలు (హమ్మింగ్ బర్డ్స్), మరెన్నో రకాల పక్షులు నిత్యం దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాయి. టికోమా గుసాడియా జాతికి చెందిన ఈ పూల మొక్కల్లో ఎన్నో రంగులు ఉన్నాయి.
అరటి... విహంగాల గూటి
అరటి చెట్టు చాలా పక్షుల పాలిట గూడు. అరటి గెలలో చిన్న చిన్న పువ్వుల్లో ఉండే తేనె కోసం ఎన్నో పక్షులు తహతహలాడుతుంటాయి. కొన్ని పక్షులు అయితే తనివితీరా మధురం తాగి, మత్తుతో ఎగరలేక మొవ్వ డొప్పలోనే నిద్రకు ఉపక్రమిస్తాయి. అరటిపండ్లు, కూర అరటికాయలు ఇచ్చే అరటి చెట్టు వాస్తవానికి పెరటి చెట్టే. ఈ చెట్టులోని ప్రతిభాగం అంటే ఆకులు, పువ్వు, కాయలు, దూట అన్నీ ఎంతో ప్రయోజనం.
అక్షింతపూలతో తుమ్మెదల జోరు
చిన్ని చిన్ని పూలు, రంగు రంగుల్లో గుత్తులుగా కనువిందు చేస్తాయి అక్షింతపూల మొక్కలు. వీటిని 'లాంటానా' అని కూడా పిలుస్తారు. వీటి పూలలో తేనె ఉండడంతో రంగు రంగుల సీతాకోక చిలుకలు ఈ మొక్కలపై నిత్యం స్వైర విహారం చేస్తుంటాయి.
కంకు ధాన్యాలతో పిచ్చుకలు
కిచకిచలాడే పిచ్చుక గొంతులు మనింట్లో మళ్ళీ వినాలనుకుంటే వరి, జొన్న మొక్కలు పెంచుకోవాల్సిందే. వీటిని పొలాల్లోనే పెంచుతారని చాలామంది అనుకుంటుంటారు. కానీ కుండీల్లోనూ, నేల మీదా వీటిని చక్కగా పెంచుకోవచ్చు.
ఆంథోరియంతో కప్పలు
ఇండోర్ మొక్కలు అంథోరియంలు పెంచుకుంటే వాటి పూల మొవ్వల్లో కప్పలు చేరి, బెకబెక లాడతాయి.
నాగదంతితో గొల్లభామలు
పరిసరాల్లో విపరీతంగా పెరిగే నాగదంతి మొక్కలు రంగు రంగుల గొల్లభామలకి నివాసం. ఇవి పూల మకరందాన్ని సేవిస్తున్నప్పుడు చూడటానికి రెండు కళ్లూ చాలవు.
ఫాన్షిటియాల్లో సన్‌బర్డ్స్
కాలాన్ని బట్టి ఆకులే పువ్వులుగా మారే ఫాన్షిటియాల్లో సన్ బర్డ్స్ ఎక్కువ సేద తీరుతాయి.
తుమ్మ చెట్లు
ముళ్ళుండే తుమ్మచెట్లు పక్షులకు నివాసం. కొంగలతో బాటు పలు విదేశీయ పక్షులకు ఇవి విడుదులు. పక్షి గూళ్ళకి తుమ్మ చెట్లు కేంద్రాలు.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506