ప్రజాశక్తి - బుట్టాయగూడెం
స్థానిక జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అదనపు వసతి భవనాలు నిర్మించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్ మాట్లాడుతూ బుట్టాయగూడెం జూనియర్ కళాశాల, డిగ్రీ కళశాలల్లో ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులు చదువు కోసం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పోలవరం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు ఉంటున్న వసతి గృహంలో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయని, వాటిస్థానంలో అదనపు భవనాలు నిర్మించాలని, అదేవిధంగా మెస్‌ఛార్జీలు రూ.45 మాత్రమే ఇస్తున్నారని, జైలులో ఉంటున్న ఖైదీలకు విద్యార్థుల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మధ్యలో ఆగిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తక్షణం పూర్తి చేయాలని, హాస్టళ్లకు కూరగాయలు సరఫరా చేసే ప్రయివేటు కాంట్రాక్టర్లను తొలగించి సరఫరాను జిసిసికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని సీనియర్ అసిస్టెంట్ గంగరాజుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.










