
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన అదనపు విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన జిల్లాలోని పలు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద మంగళవారం ఆందోళన కార్యక్రమాలు చేశారు.
మునగపాక రూరల్ : స్థానిక విద్యుత్ సెక్షన్ ఆఫీస్ ఆవరణలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలపై అదనపు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కళ్ళు కప్పి దొడ్డిదారిన సర్దుబాటు ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అదనపు విద్యుత్ భారాలు మోపి వినియోగదారులకు షాకు ఇచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రతి ఏడాది పెంచుతున్న ఛార్జీలకు అదనంగా ఈ ఛార్జీలు వేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, ఎస్ బ్రహ్మాజీ, ఆళ్ల సూరిబాబు, దాడి సత్తిబాబు, ఆడారి రమణ, పీల రామారావు, వేగి సూరిబాబు, ఆడారి పరదేశి నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల విధానం రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన స్థానిక సబ్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు గండి నాయనబాబు మాట్లాడుతూ గతేడాది కరెంటు ఛార్జీలు పెంచి రూ.1400 కోట్లు ప్రజలపై భారం వేయగా, ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి వాడుకున్న కరెంటుకు సర్దుబాటు ఛార్జీల పేరు మీద జనం నెత్తిన రూ.6000 కోట్ల భారం మోపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎర్ర దేవుడు, వనము సూర్యనారాయణ, శెట్టి రమణ, కండిపల్లి సహదేవుడు, శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం అచ్యుతాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్.రాము, నాయకులు కె.సోమినాయుడు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో 25 వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన విద్యుత్ భారం మోపడం ఎంత న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్.లక్ష్మి, ధర్మరెడ్డి సన్యాసిరావు, బి.సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి : పెంచిన కరెంటు చార్జీలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మండలంలోని ఉపమాక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయిన జగన్ ప్రభుత్వం పలు చార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మనబాల రాజేష్, మండల కమిటీ సభ్యులు ఎం.మహేష్, బి.రాము, పీక్కి రమణ, కోడా కాశీ, గోసల స్వామి, మామిడి నానాజీ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యాన
అనకాపల్లి : ప్రజలపై కరెంట్ చార్జీల భారాన్ని తగ్గించాలని, ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రతిపాదన విరవించుకోవాలని కోరుతూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి అమర్నాథ్‌ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ కర్యాక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, నాయకులు అప్పలరాజు, సన్యాసిరావు, రాజు, ఫణీంద్ర కుమార్, ఈశ్వర్రావు, ఎం.సత్తిబాబు, సాయి, రామారావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.