ప్రజాశక్తి-పాడేరు: మండలంలోని సలుగు పంచాయతీ ఈదులపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని ఏడవ వార్డు సభ్యుడు, సిపిఎం మండల కమిటీ సభ్యుడు మామిడి రాజారావు తెలిపారు. అధికారుల అలసత్వంపై సోమవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పాఠశాలలో 44 మంది పిల్లలు చదువుతున్నారని వీరిలో ఒకటో తరగతిలో పదిమంది, రెండో తరగతిలో 15, మూడవ తరగతిలో ఆరుగురు, నాలుగో తరగతిలో ఆరుగురు, ఐదో తరగతిలో 9 మంది విద్య నభ్యసిస్తున్నారని తెలిపారు. అన్ని తరగతులలో కలిపి 44 మంది విద్యార్థులకు బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని, దీంతో పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధ్యాయుని కొరతతో విద్యాభ్యాసం కుంటు పడుతోందని అదనపు ఉపాధ్యాయుడి నియామకం కోసం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణకు గత ఏడాది ఆగస్టు నెలలోనే వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా అధికారులు ఉపాధ్యాయుడి నియామకం పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 44 మంది పిల్లలు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని తెలిపారు.










