పరిశీలిస్తున్న అధికారులు
అదనపు కార్మికులతో
జగనన్న కాలనీల్లో పనులను వేగవంతం
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని జగనన్న కాలనీ లే అవుట్లలో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన మేరకు అదనపు కార్మికులను నియమించుకుని, నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని హౌసింగ్ విభాగం అధికారులను నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. జగనన్న కాలనీల నిర్మాణ పనుల పురోగతిపై హౌసింగ్ విభాగం, నగర పాలక సంస్థ అధికారులతో స్థానిక వెంకటేశ్వరపురంలోని లే అవుట్ ను కమిషనర్ శనివారం పరిశీలించారు. జగనన్న కాలనీ లే అవుట్లలో ఇండ్ల నిర్మాణాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను వేగవంతంగా కల్పించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందోని, సాంకేతిక అనుమతుల మంజూరుకు అవసరమైన అన్ని చర్యలను కార్పొరేషన్ ద్వారా తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.వందశాతం నిర్మాణ పనులు పూర్తయిన గహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేసేలా ప్రణాళికలు రూపొందించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన గహాలకు పొదుపు పథకం ద్వారా వడ్డీ లేని రుణాన్ని అందించి, ఫినిషింగ్ పనులను పూర్తి చేయాలని, త్వరితగతిన గహాలను లబ్ధిదారులకు అప్పగించాలని కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా స్థానిక కాలనీ నిర్మాణ సమయం నుంచే ప్లాట్ల యాజమానుల రాకపోకలకు, పనులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉండేలా రవాణా సౌకర్యం కల్పించాలని కమిషనర్ సూచించారు. విద్యుత్తు, వీధి దీపాలు, సి.సి కెమెరాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గహాలను కేటాయించనున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, మెప్మ సిబ్బంది, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సచివాలయం అమెనిటీస్ కార్యదర్శులు, లే అవుట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.










