ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎప్పుడో వాడిన సరుకుకు ఖర్చులు పెరిగాయన్న పేరుతో విద్యుత్ వినియోగదారుల నుంచి ఇప్పుడు ప్రభుత్వం అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. ఏ సరుకుకి లేని ఈ విధానం విద్యుత్‌కు ఎందుకు ఉండాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే అదనపు ఛార్జీల భారం మోయలేమని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు విద్యుత్ జనరేషన్ కంపెనీలు, బొగ్గు సరఫరా కంపెనీల ఇష్టారాజ్యానికి రాష్ట్ర సర్కారు ప్రజలపై భారాలు వేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా జిల్లాలో 19 లక్షల 27 వేల 77 ఎల్టీ సర్వీసులు, 1254 హెచ్‌టి (భారీ పరిశ్రమలు) సర్వీసులు ఉన్నాయి. ఈ రెండింటికీ ఈ నెలలో రూ.397.43 కోట్లు విద్యుత్ డిమాండ్ వచ్చింది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో రూ.70.31 కోట్లు అదనపు భారం ప్రజలపై పడింది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వినియోగదారులపై ఈ భారం ఎక్కువగా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, చేతి వత్తుల వారు, మెకానిక్ షెడ్ల నిర్వాహకులపై విద్యుత్ భారం రెట్టింపు అయింది. అంతంత మాత్రంగా వ్యాపారాలు సాగుతున్న ఈ సమయంలో కరెంటు బిల్లులు అధికంగా రావడంతో ఈ నెలలో అప్పులు చేసి బిల్లులు చెల్లించే పరిస్థితి ఏర్పడిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఉపాధి మార్గాలు కరువై ఆదాయం తగ్గుతున్న క్రమంలో విద్యుత్ బిల్లుల అదనపు భారం మోయలేమని సామాన్య ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న తమపై అసలే కుటుంబ పోషణ భారం కష్టంగా మారగా ప్రభుత్వం రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలను పెంచడం సరైంది కాదంటూ చిరుద్యోగులు అంటున్నారు. ఇలా విద్యుత్ భారాలపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుండగా ప్రభుత్వం మాత్రం బిల్లులు తగ్గించేది లేదంటూ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ద్వారా ముక్కు పిండి చార్జీలను వసూలు చేయిస్తుంది.
ఎప్పుడో దానికి ఇప్పుడా వసూలు.?
ఇంటికి కరెంటు రావటానికి లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వేయడానికి చేసిన ఖర్చును వసూలు చేయడాన్ని ఫిక్స్‌డ్ ఛార్జీలు అంటారు. విద్యుత్ లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్లు గడుస్తున్నా ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు చార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా జరుగుతున్నందుకు నిరంతరం కస్టమర్ ఛార్జీలను వసూలు చేయడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వాడిన విద్యుత్‌పై యూనిట్‌కు 22 పైసలు చొప్పున ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇప్పుడు వసూలు చేయడం ఏమిటని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరానికి వాడిన కరెంటుకు ఇప్పుడు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. యూనిట్‌కు 20 పైసలు నుంచి 66 పైసలు వరకూ 4 విధాలుగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇవి ప్రతి నెలా వసూలు చేయనున్నారు. దీంతో భారం ఎక్కువయ్యింది.










