ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణ జనాభాకు అనుగుణంగా అదనంగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని తెలిపారు. శివారు కాలనీల్లో సుమారు వారానికోసారి తాగునీరు సరఫరా అవుతున్నాయని, బిందె నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఉందని తెలిపారు. పట్టణ జనాభాకు ఆనుగుణంగా కొత్తగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో అధికారులకు అనేకమార్లు విన్నవించినా, ఆందోళనలు నిర్వహించినా స్పందన లేదని విమర్శించారు. పట్టణంలో ఉన్న పాత పైపులైన్ లీకేజీలతో తాగునీరు వృథా అవుతోందని తెలిపారు. కొన్ని చోట్ల కలుషితమైన నీటిని తాగి రోగాల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి పైపులైన్ లీకేజీలను అరికట్టాలని కోరారు. పట్టణంలో తాగునీటి సమస్య భవిష్యత్తులో రాకుండా శాశ్వత పరిష్కారానికి కొత్తగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ కమిటీ నాయకులు తిప్పన్న, ముక్కన్న, వెంకటేష్, నాగరాజు, మునెప్ప, ఖాన్, నాగేంద్ర ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రాధాకృష్ణ










