రోడ్డు వెంబడి భారీ లోయ
కానరాని రక్షణ చర్యలు
ఆందోళన చెందుతున్న వాహనదారులు
ప్రజాశక్తి -జిమాడుగుల : మండల కేంద్రం నుండి కోరాపల్లి పంచాయతీకి వెళ్లే మార్గంలో రోడ్డు వెంబడి ఉన్న భారీలోయ భీతిగొలుపుతోంది. రోడ్డుకు ఒకవైపున ఉన్న సుమారు 50అడుగుల లోతు లోయ ఉన్నప్పటికీ, ఆ పక్క ఎటువంటి రక్షణ చర్యలు లేవు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు అంచు కోతకు గురై ప్రమాదభరితంగా మారిందని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం ఆదమరిస్తే, భారీలోయలోకి వాహనాలు వెళ్లిపోవడం ఖాయమని, ప్రమాదతీవ్రత ఊహించుకోవడానికే ఒళ్లు గగుర్పొడుస్తోందని వాపోతున్నారు.
కోరపల్లి పంచాయతీలోని కిటుముల, బొడ్డగుంది, గన్నెలబా, జాంగిరి, లోవాసింగి, సొంగులోయి, గ్రామాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడం, ఈ మార్గంలో నిత్యం బైక్‌లతోపాటు, ఇతర వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉంటున్నాయని అంటున్నారు. ఈ రహదారిలో అదుపు తప్పితే అంతే సంగతుల అన్నట్టు భయంకరంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. రోడ్డు అంచులో భారీ లోయ ఉన్న వైపు మట్టి కొట్టుకుపోవడంతో ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రయాణికులు భీతిల్లుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి, ప్రజల ప్రాణాలు పోకముందే సంబంధిత అధికారులు స్పందించాలని, లోయ ఉన్న వైపున రోడ్డు వెంబడి రక్షణ చర్యలతోపాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అదే సమయంలో ఇప్పటికే ప్రారంభమైన రోడ్డు అంచు కోత నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










