Jul 23,2023 22:07

రైల్వే ట్రాక్‌ దాటుతున్న గ్రామస్తులు

- రైల్వే కాలిబాట మూసివేత
- అవస్థలు పడుతున్న పరిసర గ్రామస్తులు
ప్రజాశక్తి- పలాస: 
పలాస రైల్వేస్టేషన్‌ వద్ద కాలిబాట మూసి వేయడంతో స్టేషన్‌ సమీపంలో నివాసముంటున్న నర్సిపురం వాసులకు అవస్థలు తప్పడం లేదు. చాలా ఏళుగా రైల్వే వంతెన పైనుంచి రాకపోకలు చేసేవారు. వంతెన కాలిబాట శిథిలావస్థకు చేరుకుందని ఒక్కసారిగా రైల్వే అధికారులు ఇటీవల మూసివేశారు. దీంతో అప్పటి నుంచి నర్సిపురం ప్రజలతో పాటు ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న రంథ్రం నుంచి దూరి రైల్వే పట్టాలు దాటి వెళ్తున్నారు. సుమారు కిలోమీటరు పైబడి కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది. చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సిపురం నుంచి పలాస, కాశీబుగ్గ వైపు వెళ్లాలంటే కాశీబుగ్గ ఎల్‌సి గేటు దాటి వెళ్లాలి. గేటు వేస్తే సుమారు అరగంట సమయం పడుతుందని స్థానికులు చెబుతున్నారు. కాలిబాట తెరవాలని ఇటీవల ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. రైల్వే అధికారుల సమక్షంలో రైల్వే వంతెన కాలిబాట నెల రోజుల్లో తెరిపిస్తామని ఎంపీ హామీనిచ్చారు. ఏదేమైనా కాలిబాట త్వరగా తెరిచి ఇబ్బందులు ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.