
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల ఏడాదిలో అధికారులు క్రమంగా ఇరకాటంలో పడుతున్నారు. ఏ పాటి చిన్న తప్పిదం జరిగినా, ప్రభుత్వానికి నచ్చని పరిణామం చోటుచేసుకున్నా వెంటనే సంబంధిత అధికారులను విధుల నుంచి తప్పిస్తున్నారు. ప్రధానంగా పోలీసు శాఖలో ఈ వత్తిడి అధికంగా ఉంటోంది.
ఈనెల 8వ తేదీన చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి తాడేపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిలకలూరిపేట వద్ద ఆయన కాన్వారు ఎక్కువ సేపు నిలిచిపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో జాతీయ రహదారిపైకి వచ్చి చంద్రబాబు కాన్వారుకు అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులు టిడిపి కార్యకర్తలను నిరోధించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి పల్నాడు జిల్లా ఎస్‌పి రవిశంకర్‌రెడ్డి వచ్చి లాఠీఛార్జి చేసి కార్యకర్తలను చెదరొగొట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా అభియోగం ఎదుర్కొన్న చిలకలూరిపేట అర్బన్, రూరల్ సిఐలను విఆర్‌కు పంపాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే వీరి స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు.
చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వారును అడ్డుకోవాలని అప్పటికే టిడిపి అగ్రనాయకత్వం నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సందేశం వచ్చింది. ఆయన్ను 8వ తేదీ ఉదయమే పోలీసు అధికారులు గృహనిర్బంధంలో ఉంచారు. అధినాయకత్వం ఆదేశాల మేరకు పుల్లారావు తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను నేరుగా జాతీయ రహదారిపైకి పంపారు. కాన్వారు అడ్డుకోవాలని సూచించారు. ఇందుకోసం స్థానిక పోలీసు అధికారులతో కూడా చర్చించారని తెలిసింది. కాన్వారు రాకముందే కేవలం 15 నిమిషాల పాటు జాతీయరహదారిపై నిరసన తెలియచేస్తారని చెప్పడంతో పోలీసు అధికారులు కూడా పట్టుసడలించారు. జాతీయ రహాదారిపైకి నిరసన తీవ్ర రూపందాల్చి వేలాది మంది రావడంతో కాన్వారుకు అడ్డుతగిలారు. దీంతో వీరిని నియంత్రించడం పోలీసులకు కష్టతరమైంది. ఈలోగా ఎస్‌పి వచ్చి లాఠీఛార్జి చేసి కాన్వారును ముందుకు పంపారు. తిమ్మాపురం వద్ద కూడా దాదాపు 20 నిమిషాలపాటు కాన్వారు నిలిచిపోయింది. ఈ ఘటనకు బాధ్యులుగా పట్టణ సిఐ రాజేశ్వరరావు, రూరల్ సిఐ అచ్చయ్యను విఆర్‌కు పంపాలని నిర్ణయించారు.
రాజేశ్వరరావు రెండేళ్లుగా చిలకలూరిపేటలో పనిచేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు సిఐలు విఆర్‌లో ఉన్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు అనుకూలంగా పనిచేస్తున్నా ఎదో ఒక ఘటనలో ప్రత్యర్థులకు సహకరించారనో, వారికి అనుకూలంగా వ్యవహరించారన్న అంశాలపై కూడా బదిలీ వేటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పోలీసు ఆంక్షలు చేధించుకుని నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఘర్షణలను నిరోధించినా కొన్ని సందర్భాల్లో మాత్రం ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఇటీవల టిడిపి నాయకులు విద్యానగర్‌లో భారీ ర్యాలి నిర్వహించగా అనుమతి లేదని సాయిబాబారోడ్డులో బారీకేడ్లు ఏర్పాటు చేయగా వీటిని తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకువెళ్లారు. వీరిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. జనసేన నాయకులు ఇటీవల చలోఅసెంబ్లీకి పిలుపు ఇవ్వగా పార్టీ జిల్లా నాయకులను చాలా వరకు గృహ నిర్బంధంలో ఉంచినా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మందడం వరకు వచ్చి నిరసనకు దిగడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది.