Nov 01,2023 00:51

మహిళను డోలిలో మోసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి - పాడేరు
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజనుల సమగ్రాభివద్ధి అందని ద్రాక్షగానే మిగిలింది. ఏళ్ల తరబడి గిరిజనులకు రోడ్లు, రవాణా, తాగునీరు, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు మగ్యంగానే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో గిరిజనులు వెనుకబడే ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగు పడకపోవడం వల్ల చావు బతుకుల మధ్య జీవన మనుగడ సాగిస్తున్నారు. గెడ్డలు, వాగులు దాటి.. కొండలు ఎక్కి డోలిమోతలతో వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లవలసిన పరిస్థితిలో నేటికీ ఉన్నారు. ప్రభుత్వాలు అందించే అరకొర సాయంతో గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కలగడం లేదు. తరాలుగా సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. గిరిజనులు తమ సమస్యల్ని, డిమాండ్లను పరిష్కరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర వ్యతిరేకతను నేడు వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ..
జిల్లా పునర్వవ్యస్థీకరణతో ఆదివాసీల సమగ్రాభివృద్ధి ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఆదివాసీ గ్రామాలాభివృద్ధి అందని ద్రాక్షగా మారింది. రాజకీయ ప్రయోజనాలు తప్ప తమ రక్షణ - సమగ్రాభివృద్ధి వంటి వాటిపై దష్టిపెట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనానికి గిరిజనులు లోనవుతున్నారు. వాస్తవానికి రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్ళు పూర్తి కావస్తోంది. కేంద్రంలోని బిజెపి విభజన హామీల్లో ఏ ఒక్క దాన్నీ అమలు చేయలేదు. ప్రత్యేక హౌదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫాక్టరీ, రామాయపట్నం మేజర్‌ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వేజోన్‌ వంటి అంశాలన్నింటినీ గాలికి వదిలేసింది. ఇలా రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారైంది.
గిరిజన చట్టాలకు తూట్లు
అటవీ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం సవరణ చేసింది. ఎర్రవరం, పెదకోటల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటును అదానీ వంటి కార్పొరేట్లకు అప్పగించింది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టమే లేకుండా చేసింది. విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపింది. కోట్లాదిమంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌ లను తెచ్చింది. రైతులు సాగించిన పోరాటం మీద తీవ్ర దమన కాండను ప్రయోగించింది. విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరించడం వల్ల సామాన్యులకు అవి భారంగా మారాయి. మోడీ జపం చేస్తూ జగన్‌ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో జతకట్టి ముందుకు సాగుతోంది. ఆదివాసీల భవిష్యత్తును పణంగా పెడుతోంది. జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌ పునరుద్ధరణ చేయాలని. ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయాలని గిరిజన నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సుప్రీంకోర్టు జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌ ను పునరుద్ధరణ చేయకుండా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులతో ఉద్యోగాలు భర్తీచేయడం వల్ల సుమారు 2 వేల ఉద్యోగ పోస్టులను స్థానిక ఆదివాసీలు కోల్పోయారు. 1/70 చట్టాన్ని ధిక్కరించి ఆదివాసీల భూములు ఆక్రమణ, మరోపక్క అర్హతలేని బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించడం, నకిలీ గిరిజనులకు ప్రోత్సహించడం వల్ల విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, భూక్రయ విక్రయాల్లో స్థానిక ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. వీటిపై అధికార ప్రజాప్రతినిధులు ప్రశ్నించడం లేదు.
ఇబ్బందుల్లో కాఫీ రైతులు
ఏజెన్సీలో కాపీ రైతులు తమకు ప్రోత్సాహక సొమ్ము అందక, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక పోరాటాలు సాగిస్తున్నారు. పివిటిజి గిరిజనులు తమ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పోరాడుతున్నారు. అనేక ఆదివాసీ సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం సాగిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివాసీ ప్రజల రక్షణ - సమగ్రాభివృద్ధి పేరుతో నేటి నుంచి అల్లూరి జిల్లాలో వారం రోజులు పాటు సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్రకు సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు రథ సారథ్యంలో ఈ యాత జరుగుతోంది.