May 14,2023 00:15

ర్యాలీ చేపడుతున్న సంఘం నేతలు

ప్రజాశక్తి-కొత్తకోట:వడ్డీ వ్యాపారుల నుంచి ఆదివాసీలను రక్షించాలని అఖిల భారత్‌ గ్రామీణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిఎస్‌ అజరుకుమార్‌ కోరారు. శనివారం రావికమతం మండలం కొత్తకోటలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రావికమతం మండలంలోని అనేక గిరిజన గ్రామాలలో ఆదివాసీలు పెంచిన జీడి మామిడి తోటలను 99 సంవత్సరాల లీజు పేరుతో గిరిజనేతర వడ్డీ వ్యాపార వర్గాలు ఆక్రమించు కుంటున్నాయని, ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వడ్డీలకు వడ్డీలు తప్పుడు లెక్కలు రాస్తూ చక్రవడ్డీలు కట్టి ఆ పేరుతో జీడి మామిడి సంపదను షావుకారులు దోచుకుపోతున్నారని ఆరోపించారు. 36 కుటుంబాలు ఉన్న రొచ్చపనుకు గ్రామం నేడు రెండు కోట్లకు పైగా అప్పులో మునిగిపోయి ఉందన్నారు. రెండు కోట్ల అప్పులకు వడ్డీ పేరుతో ఈ ఏడాది ఆ గ్రామంలో పండిన మొత్తం జీడిపంటను షావుకారులు దోచుకు పోయారన్నారు. వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలను బయటకు తీసుకురావాలని, 99 సంవత్సరాల లీజు ఎగ్రిమెంట్‌ పేరుతో ఆదివాసీల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ బంజర పట్టాలు, అటవీ పట్టా భూములను తిరిగి ఆదివాసీలకు బేషరతు గా అప్పగించాలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అజరు కుమార్‌ గుర్తు చేశారు. ముందుగా కొత్తకోట మూడు రోడ్లు కూడలిలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లిలో ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మండల కన్వీనర్‌ మోసూరు రాజు ఆదివాసీలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ సంఘం కార్యదర్శి ఎస్‌ గణేష్‌, మోసూరి రాజు పాల్గొన్నారు.
భూములు లీజులపై ఆందోళనకు రెవెన్యూ పోలీస్‌ అధికారులు స్పదించారు. శనివారం సాయంత్రం ఆ గ్రామాన్ని రావికమతం తహసీల్దార్‌ మహేశ్వరరావు, కొత్తకోట సిఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహమ్మద్‌ సందర్శించారు. ఈ సందర్బంగా బాధిత గిరిజనులు మాట్లాడుతూ, తీసుకున్న అప్పులు వడ్డీలతో పెరిగి అదే భూములను వ్యాపారులకు లీజుకు వ్రాసామని వివరించారు. వడ్డీలు కట్టలేని స్థితిలో తమ భూములు స్వాధీనం చేసుకోవడం తో ఫలసాయం తమకు అందటం లేదని వాపోయారు. దీనిపై స్పందించిన అధికారులు సంబంధిత వ్యాపారులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎస్‌ఐ విభూషణరావు, ఆర్‌ఐ చినబ్బాయి పాల్గొన్నారు.