ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ఆదివాసీ దినోత్సవాన్ని పోరాటాల దినంగా నిర్వహించాలని, ఆదివాసీలను మభ్యపెట్టేందుకు పాలకవర్గాలు నిర్వహించే సభలను బహిష్కరించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్ పిలుపునిచ్చారు. బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సురేష్ అధ్యక్షతన జరిగిన ఆదివాసి దినోత్సవ పోరాట సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్, రైతు కూలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోరండ్ల శ్రీనివాస్, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు ఎస్.రామ్మోహన్ మాట్లాడారు. దేశంలో ఆదివాసీలపై తీవ్రమైన హింస, మరణకాండ జరుగుతుందన్నారు. మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు దారుణమన్నారు. గిరిజనుల కోసం తెచ్చిన 1/70 చట్టాన్ని, పీసా, 2006 అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఎఐకెఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ, పివైఎల్ డివిజన్ నాయకులు కె.పోతురెడ్డి, తగరం బాబూరావు, పిఒడబ్ల్యూ నాయకులు వెట్టి భారతి, కె.లత, అలివేరు సర్పంచి కారం లక్ష్మీ, పులిరామన్నగూడెం సర్పంచి మడి శ్రీరాములు, ముంజులూరు సర్పంచి ముక్కారెడ్డి, గెడ్డపల్లి సర్పంచి సుండ్రు శారద, అంతర్వేది గూడెం ఎంపిటిసి కొవ్వాసు గోవిందరాజు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు భూషణం మాట్లాడారు. అనంతరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కన్నాపురంసెంటర్‌లో అరుణోదయ కళాకారులతో కళారూపాలు ప్రదర్శించారు.










