Feb 17,2021 06:46

కరోనా కాలంలో అత్యధికంగా బాధలు అనుభవించినది ఆదివాసీలే. లాక్‌డౌన్‌ వలన పనులు పోగొట్టుకున్నవారిలో ఆదివాసీలే గణనీయంగా ఉన్నారు. ఈ కాలంలో ఆదివాసీలు సేకరించిన అటవీ ఉత్పత్తులకు రేట్లు రాలేదు. ఆన్‌లైన్‌ క్లాసులలో పాల్గొన గలిగే పరిస్థితులు ఆదివాసీ విద్యార్ధులకు లేనందున ఈ కాలంలో చదువుకు దూరం కావడమే గాక, తక్కిన విద్యార్ధులకన్నా వెనకబడిపోయారు. ఆదివాసీలలో అత్యధికులు కాజువల్‌, కాంట్రాక్టు కూలీ లుగా పని చేస్తున్నారు. ఈ కాలంలో వారికి కనీస వేతనాలు ఎక్కడా రాలేదు. రైతులుగా ఉన్న ఆదివాసీలకు ఎక్కడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందలేదు.


ఈ నేపథ్యంలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆదివాసీలకు ప్రత్యేకంగా అదనపు కేటాయింపులు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని మోడీ ప్రభుత్వ బడ్జెట్‌ ఆదివాసీల పట్ల క్షమించరాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వరంగ సంస్థల వద్ద ఉన్న భూములను అమ్మి సొమ్ము చేసుకోడానికి ఒక ప్రత్యేక ఏర్పాటును ఈ బడ్జెట్‌ ప్రతిపాదించింది. వాస్తవానికి ఆ భూములలో చాలా భాగం పేదల నుండి, ఆదివాసీల నుండి సేకరిం చినదే. వారి ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ భూములను భూసేకరణ చట్టం పేరుతో పొందిన నిరంకుశ అధికారాలను అడ్డం పెట్టుకుని గతంలో సేకరించారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరం లేకపోతే వాటిని తిరిగి ఆ భూము ల వాస్తవ యజమానులైన ఆదివాసీలకు, పేదలకు అప్పజెప్పాలి. దానికి బదులు వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుంటోంది.


మౌలిక సదుపాయాల, వసతుల కల్పనను ప్రైవేటుపరం చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంటే రోడ్లు, హైవేలు వంటివి ప్రైవేటు ఆధిపత్యం కిందకు పోతాయి. వాస్తవానికి ఈ హైవేల నిర్మాణానికి గిరిజన ఉపప్రణాళిక నిధులను అనేక చోట్ల వినియోగించారు. ఇప్పుడు వాటిపై పెత్తనాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పనున్నారు. ఆ కార్పొరేట్లు వాటిపై యూజర్‌ చార్జీలను వసూలు చేస్తారు. అంటే గిరిజనుల సొమ్ముతో రోడ్లు నిర్మించి, వాటిని వినియోగించినందుకు ఆ గిరిజనుల నుండే తిరిగి చార్జీలు గుంజుతారన్నమాట. ఇందులో రెండు విధాలా ఆదివాసీలనే కొల్లగొడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఆహార సబ్సిడీలో 43 శాతం, ఉపాధి హామీ పథకంలో 35 శాతం, విద్య లో 6 శాతం కోత పెట్టారు. సామాజికంగా ఇప్పటికే వెనుకబడిన ఆదివాసీలు ఇందువలన ఇంకా వెనకబడతారు.


ఈ బడ్జెట్‌లో గిరిజన ఉపప్రణాళిక కింద కేటాయింపులను గత ఏడాదితో పోల్చితే రూ.26,000 కోట్లు పెంచినట్టు చూపించారు. ఆ కేటాయింపుల వివరాలలోకి పోతే అసలు మోసం అర్ధం ఔతుంది. రూ.9,000 కోట్లు ఆహార మంత్రిత్వ శాఖ పద్దు కింద చూపారు. ఇందులో ఎక్కువ భాగం భారతీయ ఆహార సంస్థకు కేంద్రం బకాయిలను చెల్లించడానికే ఖర్చు చేస్తారు. గిరిజనులకు దక్కేది ఏమీ ఉండదు. నిజంగా గిరిజనులకు మేలు చేయాలనుకుంటే ఈ సొమ్ముతో గిరిజనులందరినీ అంత్యోదయ పథకం కిందకు తెచ్చి వారిని ఆకలి బాధ నుండి కాపాడవచ్చు. కాని మోడీ ప్రభుత్వం తాను చెల్లించవలసిన అప్పు కింద ఈ సొమ్మును ఖర్చు చేయనుంది. మరో రూ. 4,000 కోట్లను హైవేలు, రోడ్లను నిర్మించడానికి కేటాయించారు. కాని ఆ సొమ్మును కూడా గిరిజన ఉప ప్రణాళిక కిందే చూపించారు. ఆ హైవేలతో ఆదివాసీలకు ఒరిగేది ఏముంది? ఇంకో రూ. 3,600 కోట్లు ఎరువుల సబ్సిడీ కింద చూపించారు. అసలు ఇంతవరకూ ఎక్కడైనా గిరిజనులకు ఎరువుల సబ్సిడీ లభించిందా? ఇటువంటి కేటాయింపులు కాగితాలపై ఉండిపోయి చివరకు ఖర్చు కావు. ఎంతెంత కేటాయించామో చూడండి అని చెప్పుకోడానికే తప్ప ఎందుకూ ఉపయోగపడవు.


ఇక చాలా గొప్పగా చెప్పిన ఏకలవ్య పాఠశాలల గురించి చూద్దాం. 750 ఏకలవ్య మోడల్‌ ఆశ్రమ పాఠశాలలను కొత్తగా గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఒక్కో పాఠశాలకూ నిర్మాణానికి అయ్యే ఖర్చును రూ.20 కోట్ల నుండి రూ.38 కోట్లకు పెంచారు. కొండిపాంతాల్లోనైతే దీనిని రు.48 కోట్లకు పెంచారు. ఒక్కో పాఠశాలకు రూ.38 కోట్ల చొప్పున లెక్క వేసినా ఇందుకు రూ.22,500 కోట్లు అవసరం. ఐతే బడ్జెట్‌లో అదనంగా కేటాయించినది కేవలం రూ.100 కోట్లు మాత్రమే (గత ఏడాది రూ.1313 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.1418 కోట్లు కేటాయించారు) ప్రస్తుతం 588 ఏకలవ్య పాఠశాలలు ఉంటే అందులో 303 పని చేయడం లేదు. కేవలం 191 పాఠశాలలకు మాత్రమే భవనాలు పూర్తి అయ్యాయి. నిధుల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ వాస్తవాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేయడం కూడా చేతకాని ప్రభుత్వం కొత్తగా 750 పాఠశాలలు ఏర్పాటు చేసేస్తామని ప్రకటించడం, అందుకోసం కేవలం రూ.100 కోట్లు మాత్రం కేటా యించడం అంటే ఎంత బూటకమో ఆలోచించండి!


ఇక గిరిజన విద్యకు, వారిలో అక్షరాస్యతను పెంచడానికి గత ఏడాది రూ.5,841 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.5,297 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే రూ.554 కోట్లు తగ్గించారు. గిరిజన విద్య పట్ల బిజెపి ప్రభుత్వానికి ఎంత చులకనో దీనిని బట్టే తెలుసుకోవచ్చు. గిరిజన వ్యవసాయంలో రూ.979 కోట్లు కోతబెట్టారు. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించినా అందుకోసం రూ.155 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఏ మూలకూ చాలదు. ఆరోగ్య రంగంలో రూ.337 కోట్లు కోత పెట్టారు. వంటగ్యాస్‌ సబ్సిడీలో గిరిజనులకు గతేడాది రూ.1631 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడు కేవలం రూ.536 కోట్లు మాత్రమే కేటాయించారు. బహుశా గిరిజన మహిళలకు వంట గ్యాస్‌ ఉపయోగించే హక్కు లేదని బిజెపి ప్రభుత్వం అనుకుంటున్నదేమో!


దేశ జనాభాలో 8.6 శాతం గిరిజనులు. కనుక బడ్జెట్‌లో కనీసం 8.6 శాతానికి తగ్గకుండా గిరిజనులకు కేటాయించాలి. ఆ లెక్కన చూస్తే రూ.2,99,558 కోట్లు కేటాయించాలి. కాని కేవలం రూ.79,941 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 2.3 శాతం మాత్రమే. ఇందులోనూ పైన తెలిపినట్టు ఉత్తుత్తి కేటాయింపులు కూడా కలిసివున్నాయి. ఆదివాసీలకు ఈ బడ్జెట్‌లో రు.2 లక్షల కోట్లకు పైగా నష్టం జరిగింది.


గతేడాది కేటాయింపుల్లో కేవలం 48 శాతం మాత్రమే ఖర్చు చేసినట్టు గిరిజన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ చూపిస్తోంది. లాక్‌డౌన్‌ తో, పేదరికంతో, నిరుద్యోగంతో, ఆకలితో బాధ పడుతున్న గిరిజనులకు చేసిన కేటాయింపులే తక్కువ కాగా వాటిని కూడా ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదు. 9 నెలల కాలంలో కేవలం 48 శాతం మాత్రమే ఖర్చు చేయగలిగితే, తక్కిన 3 నెలల కాలంలో 52 శాతం ఖర్చు చేయడం సాధ్యమా అన్నది ప్రశ్న. ఇంత ఘోరంగా గిరిజనులకు అన్యాయం చేసిన ఈ కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనమంతా తమ నిరసనను తెలియజేయాలి. ఉద్యమాలు నడిపి న్యాయంగా రావలసిన వాటాను రాబట్టాలి.
                                                                * ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ *