Aug 25,2023 22:15

చాపరలో ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన సంఘ నాయకులు

* గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రాంబాబు
* ఘనంగా గిరిజన సంఘ జిల్లా మహాసభలు
ప్రజాశక్తి - మెళియాపుట్టి: 
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రాంబాబు పిలుపునిచ్చారు. గిరిజన సంఘం 8వ జిల్లా మహాసభలు మండలంలోని చాపరలో శుక్రవారం నిర్వహించారు. ప్రదర్శన అనంతరం గిరిజన సంఘం జెండాను సీనియర్‌ నాయకులు జన్ని రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఓట్ల కోసం అభివృద్ధి చెందిన బోయ వాల్మీకులను ఎస్‌టి జాబితాలోకి చేర్చడం నేటికీ అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజనులను మోసం చేయడమేనన్నారు. గిరిజనుల సాగు భూములకు హక్కు పట్టాలు ఇవ్వాలని, జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్‌ 18వ తేదీన కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మక అప్పన్న అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో సంఘ జిల్లా కార్యదర్శి సవర ధర్మారావు. బొంతు అప్పారావు. ఎస్‌.జోగేంద్ర, రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మణరావు. ఎల్లయ్య, సూరయ్య, కె.విమల తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభల్లో గిరిజన సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బొంతు అప్పారావు, కార్యదర్శిగా నిమ్మక అప్పన్న, ఉపాధ్యక్షులుగా ధర్మారావు, ఎస్‌.జోగేంద్ర, ఆదినారాయణ సహాయ కార్యదర్శులుగా ఎస్‌.ఫల్గుణరావు, రుషితో పాటు కమిటీ సభ్యులు మరో ఏడుగురిని ఎన్నుకున్నారు.