Aug 28,2023 21:56

సీతంపేట.. పూతికవలసలో పంటలను పరిశీలిస్తున్న ట్రెయినీ ఐఎఎస్‌ల బృందం

ప్రజాశక్తి -భామిని : క్షేత్రస్థాయిలో గిరిజన జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి మండలంలోని బొడ్డగూడ గ్రామాన్ని ఏడుగురితో కూడిన ట్రెయినీ ఐఎఎస్‌ల బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారికి గిరిజనులు డప్పు, వాయద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రెయినీ ఐఎఎస్‌లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గిరిజనులతో మమేకమై, వారి సమస్యలు, స్థానికంగా లభిస్తున్న విద్య, వైద్య రసౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పండగలు, జీవనంలో వస్తున్న మార్పులు, పంటలపై ఆరాతీశారు. అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికను, పండిస్తున్న పంటలు, గిరిజన గ్రామదేవత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మాణం లేదని, గర్భిణులను దృష్టిలో ఉంచి స్థానికంగా వైద్య సదుపాయం కల్పించాలని గిరిజనులు కోరారు. తాగునీటి సదుపాయాలు కల్పించాలని, గిరిజనులు నివాసం ఉంటున్న కొండ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో ట్రెయినీ ఐఎఎస్‌లు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎఎంఒ కోటి బాబు, డిడి శ్రీనివాసరావు, సర్పంచ్‌ అనంత్‌, తహశీల్దార్‌ అప్పారావు, ఎంపిడిఒ జి.చంద్రరావు, సెక్రటరీ చంద్రశేఖర్‌, వెలుగు భవాని పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో మారుమూలైన గిరిజన ప్రాంతమైన పూతికవలస గిరిజన ప్రాంతాన్ని ట్రెయినీ ఐఎఎస్‌ల బృందం సందర్శించింది. గ్రామస్తులతో మమేకమై వారి స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూతికవలస ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యా ప్రమాణాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం సిబ్బందితో మాట్లాడి, సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. అక్కడ పంట పొలాలను పరిశీలించారు. ఈ బృందం వెంట ఎటిడబ్ల్యుఒ జి.మంగవేణి, ఎంఒ పి.కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.