Jul 09,2023 23:53

భూములు పరిశీలిస్తున్న సురేంద్ర, నాయకులు

ప్రజాశక్తి-అనంతగిరి:విజయనగరం రాజులు గిరిజనుల భూములు . వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో. సురేంద్ర హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు. బాలదేవ్‌, సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు. టోకూరు సర్పంచ్‌ కిల్లో. మొస్యలతో కలిసి సురేంద్ర ఆదివారం అనంతగిరి మండలం అనంతగిరి, టోకూరు, ఎగువుశోభ, కొండిబ పంచాయితీల పరిధిలోని కొత్తవలస, ఎక్టగూడ, అనంతగిరి, మొండిజాముగుడ, బికంబవలస, రాయివల, మువ్వంవలస, డముకులో నెలకొన్న భూ సమస్య పై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తాత మూత్తాతల కాలం నుండి సాగు చేస్తూ జీవనం సాగిస్తునామని, ఈ మద్యకాలంలో సంబందం లేని వ్యక్తులు తమ భూములపై కన్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నతరం సురేంద్ర మాట్లాడుతూ, మండలంలోని అనంతగిరి, కొండిభ, టోకురు, ఎగువసోభ పంచాయితీ పరిధిలోని గ్రామాల్లో సుమారు 318 ఎకరాల భూమిపై విజయనగరం రాజులు కన్నేసి, ఈ భూమిపై సుప్రీంకోర్టులో కేసు వేశారన్నారు.ి కోర్టు తీర్పుతో జిల్లా కలెక్టర్‌ ఆదేశం మేరకు మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేసి రాజుల భూములు గుర్తించాలని ఉత్తర్వులు ఇచ్చి ఆదివాసులు ముత్తాతాల కాలం నుండి సాగు చేస్తున్న జిరాయితి, బంజరు, కొండపోడు భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండపోడు పట్టాలు ఆదివాసి రైతులకు గతంలో మంజూరు చేశారన్నారు. ఆదివాసుల భూరక్షణకు 1959 భూరక్షణ చట్టం, 1970 లో భూ బదలాయింపు 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం అమలుల్లో ఉండగా విజయనగరం రాజులకు ఆదివాసీల సాగులో ఉన్న భూములు ఎలా చెందుతాయని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, అల్లూరి జిల్లా కలెక్టర్‌ స్పందించి విజయనగరం రాజులు చేస్తున్న రాచరిక చేష్టలను ఆపాలన్నారు. ఐదవ షెడ్యూల్‌ ఏరియా ఆదివాసి రక్షణ చట్టాలను అమలు చేసి ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సొమ్మెల ఆనందరావు, కొర్ర .అప్పన్న, శాంతి, ఎస్‌.గంగులు పాల్గొన్నారు.