Mar 18,2023 23:59

నినాదాలు చేస్తున్న ఆదివాసీలు ఆ

ప్రజాశక్తి-రోలుగుంట:రోలుగుంట మండలం ఎంకె.పట్నం శివారు చటర్జిపురం గ్రామం గదబ ఆదివాసీల సాగుబడి రికార్డులలో ఉన్నా ఆదివాసీల పేర్లను ఏకపక్షంగా తొలగించారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంకె.పట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 139లోని పదెకరాల భూమిలో చటర్జీపురంకు చెందిన గదబ ఆదివాసీలకు చెందిన నాలుగు కుటుంబాలు తరతరాలుగా సాగులో ఉన్నాయన్నారు.. కేదారి రాజుబాబు అనే కుటుంబం కూడా అదే భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందన్నారు. గిరిజనులు మెట్టు పంటలను పండిస్తూ జీవనోపాధి సాగిస్తున్నారని తెలిపారు. గతంలో తాము ఇచ్చిన వినతిపత్రాలపై స్పందించిన రోలుగుంట రెవెన్యూ అధికారులు సాగు అనుభవాన్ని తనిఖీ చేసి సాగుబడి రిజిస్టర్‌లో పేర్లను కూడా నమోదు చేసి, రిజిస్టర్‌ సర్టిఫికేట్‌ కాఫీలు కూడా ఇచ్చారన్నారు. తమ సాగులో ఉన్న భూమిని కాకినాడ జిల్లా బిక్కవోలు మండలానికి చెందిన ఒక వ్యక్తి పేరుతో మార్చేయబోతున్నారని తెలుసుకొని స్థానిక అధికారులకు గతంలోనే విజ్ఞప్తి చేశామన్నారు.నర్సీపట్నం న్యాయస్ధానంలో కూడా ఆ గిరిజనేతరుడిపై దావా వేశామన్నారు. సాగులో ఉన్న వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, తమ వాదనలూ వినకుండా రికార్డుల్లో మార్పు చేయడం చట్టపరంగా చెల్లదన్నారు. గత ఏడాది నవంబర్‌లో తహశీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు ఆయా రికార్డులు మార్పు చేయడంతో పాటు సాగుబడి రిజిస్టర్‌లో అప్పటికే నమోదైన తమ పేర్లను తొలగించేశారని బాధితులు ఆరోపించారు. తమకు ఈ భూమి తప్పా వేరే జీవనాధారం లేదని, వ్యవసాయాన్ని నమ్ముకొని తాతల నుంచి నుండి ఇక్కడే జీవిస్తున్నామని తెలిపారు. అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం మండల కన్వీనర్‌ మోసూరి రాజు మాట్లాడుతూ, నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీలకు అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత చాలా అన్యాయం జరుగుతోందని వాపోయారు. చీడికాడ నుంచి నాతవరం ప్రాంతంలోని మండలాల్లో ఆదివాసీల సాగులో ఉన్న భూముల్ని ఏకపక్షంగా రికార్డులు మార్చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించడం లేదన్నారు. తొలగించిన ఆదివాసీ సాగుదారుల పేర్లను రికార్డుల్లో పునరుద్దరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు నీలాపు నూకాలమ్మ, అప్పలనాయుడు ు పాల్గొన్నారు.