ప్రజాశక్తి -కొత్తకోట
తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ రావికమతం మండలం చీమలపాడు శివారు జీలుగులోవ గ్రామ ఆదివాసీలు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన కొర్ర గసన్న, కొర్ర బాలరాజు తదితరులు మాట్లాడుతూ, జెడ్ జోగంపేట గ్రామానికి సుమారు మూడు కిలో మీటర్లు దూరంలో సామలమ్మ కొండపై గత కొన్నేళ్లుగా సుమారు పది కుటుంబాలు జీవనం సాగిస్తున్నా మని, 50 మంది జనాభా కలిగిన తమకు నేటికీ కనీసం తాగునీరు, రహదారి, విద్యుత్ సౌకర్యం లేదన్నారు. జనాభాలో 16 మంది వరకూ చదువు కునే చిన్నారులు ఉన్నారని, వీరు విద్యకు నోచు కునేందుకు అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల వంటి సదుపాయాలు లేవని వాపోయారు. మూడు కిలో మీటర్ల దూరంలో జెడ్. జోగంపేట ప్రభుత్వ పాఠశాలకు అటవీ మార్గం లోనే రాక పోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. గ్రామంలో ఎవ్వరికి అనారోగ్యం కలిగినా వైద్య సేవలు అందలేదని, గత నెలలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సీదిరి వెంకటరావు మార్గ మధ్యలో మృతి చెందాడని, ఈ సమస్యలపై గత ఆరు నెలల కిందట మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా గ్రామాన్ని సందర్శించి మౌళిక సదుపాయల కల్పనకు చొరవ చూపాలని ఆదేశాలు జారీ చేయగా ముగ్గురు ఆర్‌డివో స్థాయి అధికారులతో పాటు ట్రైబుల్ వెల్ఫేర్ అధికారులు గ్రామానికి వచ్చారని తెలిపారు. వచ్చిన ప్రతి అధికారి గ్రామాన్ని సందర్శించి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడమే గాని అందుకు కృషి చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఆదివాసీ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి మౌళిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టాలని ఐదవ షెడ్యూల్ సాధన కమిటి జిల్లా గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు, ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సూరిబాబు, గిరిజనులు తదితరులు డిమాండ్ చేశారు.










