సాలూరు: ఈనెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివాసీ ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజన సంఘాల నాయకులు, అధికారులు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పిఒ కోరారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా గిరిజన సంస్కతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు, స్టాల్స్ ఏర్పాటు పై ఆయన అధికారులకు సూచించారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర ఉత్సవాల నిర్వహణపై ఆదివారం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో గిరిజన సంక్షేమ డిడి కె.శ్రీనివాసరావు, జిసిసి డిఎం మహేంద్ర కుమార్, డిఇఒ నిమ్మక ప్రేమ్‌కుమార్, వెలుగు అధికారులు పాల్గొన్నారు.










