ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ఆదివాసీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఆదివాసి ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్ మొడియం శ్రీను డిమాండ్ చేశారు. శనివారం ఆదివాసీ ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో స్థానిక ఆదివాసీ ఉద్యోగి ఎంఇఒ బి.రాముడుపై స్థానిక వికాస్ పాఠశాల కరస్పాండెంట్ జగన్నాథరావు చేసిన దౌర్జన్యంపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్ మాట్లాడుతూ ఇటీవల వికాస్ పాఠశాల కరస్పాండెంట్ జగన్నాధరావు పాఠశాల అనుమతుల కోసం ఎంఇఒ రాముడుపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జగన్నాధరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ఉద్యోగ సంఘాల జెఎసి సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆనంతరం స్థానిక ఎస్‌ఐ సాగర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ గిరిజన సంక్షేమ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం పోసియ, వైసిపి టీచర్స్ అసోసియేషన్ నాయకులు కందుల ప్రకాష్, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోదింరాజు, దేవర దీవెనరావు పాల్గొన్నారు










