Oct 22,2020 07:14


ఆశయ సాధనకు సాయుధ తిరుగుబాటే ప్రధానంగా భావించి 'రాజ్యాధికారం వస్తే తప్ప ఊరు మనది. ఈ వాడ మనది' కాదన్న చైతన్యాన్ని, స్ఫూర్తిని ముందు తరాలకు చాటిచెప్పిన పోరాట యోధుడు కొమురం భీమ్‌. గోండు తెగకు చెందిన కారం చిన్నం, సోంబాయి దంపతులకు 1905 అక్టోబర్‌ 22న అదిలాబాద్‌ జిల్లా సంకెపల్లి గ్రామంలో కొమురం భీమ్‌ జన్మించాడు. ఒక రోజు అడవిలో ఇప్ప పూలు ఏరుకోవడానికి వదినమ్మకు తోడు వెళ్ళిన పదిహేనేళ్ల భీమ్‌కు...ఆమె పాడిన పాటల్లోంచి ఎన్నో సందేహాలు పుట్టుకొచ్చాయి. భూమి, నీళ్ళు, అడవి అన్నీ దేవుడు ఇచ్చినవే అంటారు. కానీ మనుషుల మధ్యన ఈ తేడా ఎట్లా వచ్చినాయో? భీమ్‌ ఒక గోండు నాయకుడిగా ఎదగడానికి ఈ ఆలోచనలే అతనిని ఎక్కువ ప్రభావితం చేశాయి. గూడెంలో భీమ్‌ తండ్రి ప్రజలకు తీర్పులు చెప్పే పెద్ద. ఒక నాడు 'తప్పులు చేసిన వారికి శిక్ష వేస్తున్నారు. మరి అధికారులు, షావుకార్లు తప్పులు చేస్తే...?' అని తన తండ్రిని ప్రశ్నిస్తాడు.
తండ్రి విష జ్వరంతో మరణించినప్పుడు సంకెపల్లి నుండి సర్దాపూర్‌ నివాసం మారారు. అక్కడ తాము కష్టపడి, అడవిని నరికి పండించుకున్న పంట భూములు తనవేనంటూ పాటేదారు సిద్ధికి రావడంతో భీమ్‌కు విపరీతమైన కోపం వస్తుంది. భీమ్‌ చిన్న నాయన యేసును సిద్ధికి చంపబోగా అతన్ని కాపాడుకునే క్రమంలో భీమ్‌ చేతిలో ఉన్న కర్ర బలంగా తగలడంతో సిద్ధికి చనిపోతాడు. అయితే సిద్ధికి సంఘటన భీమ్‌ జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. ఆ గ్రామం నుండి అస్సాం చేరుకుని తేయాకు తోటల్లో చేరి, నాలుగు సంవత్సరాలు కూలీగా పని చేశాడు. అప్పుడే చదవడం, రాయడం నేర్చుకోవడంతో పాటు దేశంలో అప్పటి తిరుగుబాటు గురించి రాజకీయాల గురించి తెలుసుకున్నాడు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరుగుబాటు భీమ్‌ జీవితాన్ని మార్చేసింది.
''మనిషి అంటే తన కోసం తను ముక్కుతూ మూలుగుతూ బతకడం కాదు. నలుగురికి ఉపయోగపడాలి. సీతారామరాజు అందరి దు:ఖాలను, కష్టాలను తనవనుకున్నాడు. ఈ మట్టి మనుషుల కోసం ఈ మట్టి చేతుల కోసం తన ప్రాణాలను ఇచ్చేడు. మనిషి బతకాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే అన్నీ నేర్చుకోవాలి. అడవిలో జంతువుల్లాగా ఆకు, అలం, పురుగులు తిని బతుకుతుంటే జీవితం వధా అయిపోతుంది..' అంటూ భీమ్‌ చేసిన ఆలోచన అతన్ని రాజకీయంగా మరింత చైతన్యవంతుణ్ణి చేసింది. కొన్నాళ్ల తర్వాత అస్సాం నుండి తమ గూడెం చేరుకున్నాడు. తన గూడెం పరిస్థితి చూసి భీమ్‌ మనసు బాధతో మూలిగింది. తనవారి కోసం ఏదో ఒకటి చేయాలి. అయితే ఈసారి కొంచెం ఆలోచించి పనులు చేయాలి. ఏది చేసినా అందర్నీ కూడా పెట్టుకొని పకడ్బందీగా చేయాలని నిశ్చయించుకున్నాడు.
అదిలాబాద్‌ ఏజెన్సీలో పత్తి, అడవిలో లభించే కలపకు అధిక విలువ ఉండేది. అయితే అడవి నరికి పోడు వ్యవసాయం చేయరాదని, అడవిలో వేటను నిషేధిస్తూ, ప్రజలపై వివిధ రూపాల్లో ఇబ్బందికి గురిచేసే అటవీ చట్టాన్ని 1918లో నైజాం సర్కార్‌ తెచ్చింది. అప్పటికే బతుకు తెరువు కోసం పోడు వ్యవసాయం మొదలు పెట్టిన 12 గూడేలలో ఆదివాసీలపై సర్కారు అక్రమ కేసులు నమోదు చేసింది. గూడేలను తగలబెట్టింది. పంట నాశనం చేస్తూ భయోత్పాతాన్ని సృష్టించింది. భీమ్‌తో పాటు వారి చిన్నాన్నలను 12 గూడేల గోండులు నైజాం సర్కార్‌తో మధ్యవర్తిత్వం కోసం పెట్టుకున్నారు. న్యాయబద్ధంగా భూ సమస్యపై నైజాం నవాబుకు ముఖాముఖి నివేదించడం కోసం హైదరాబాద్‌ వెళ్లిన ప్రతినిధి బృందానికి దర్శనం దొరకకపోగా, అవమానపడి తిరిగి వచ్చారు.
ఇంతవరకూ భీమ్‌ పోరాటం అనే మాట ఎత్తకుండా 'కానూన్‌' సహాయంతో తమ హక్కులు పొందాలని ప్రయత్నించాడు. ఇక పోరాటం అనివార్యమని భీమ్‌ తలచి అన్ని గూడేల జనాల్ని ఏకం చేసి సంఘటితంగా జోడెన్‌ ఘాట్‌లో అటవీ అధికారుల మీద తిరగబడ్డారు. అరెస్టు చేయాలనుకుని వచ్చిన పోలీసులను ప్రజలు తరిమేశారు. దాంతో నైజాం సర్కార్‌ దిగి వచ్చి నయానో భయానో గోండులను, కొలములను లొంగదీయడానికి ప్రయత్నించింది. చివరి ప్రయత్నంగా ప్రభుత్వం సబ్‌ కలెక్టర్‌ను జోడెన్‌ ఘాట్‌కు పంపింది. 12 గ్రామాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, అన్ని రకాల అప్పులను మాఫీ చేస్తామని, పోరాటాన్ని విరమింపజేయాలని సబ్‌కలెక్టర్‌ ప్రతిపాదిస్తాడు. కానీ కొమురం భీమ్‌ 12 గ్రామాల మీద రాజ్యాధికారం డిమాండ్‌ చేయడంతో చర్చలు విఫలమవుతాయి. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా ఏడు నెలల పాటు పోరు నడుస్తున్నా గెలుస్తామన్న నమ్మకం భీమ్‌కు సన్నగిల్లుతుంది. కారణం గోండు జాతి ఒక ఆటవిక తెగ. వారికి బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. భీమ్‌ ఒక్కడికి తప్ప బయట ప్రపంచం గురించి ఎవరికీ అంతగా తెలియదు. అందుకనే మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన షావుకార్లు మాయమాటల్లో సులభంగా పడిపోయారు.
నాటి దేశ రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల గురించి వారికి అవగాహన లేదు. చట్టం, అందులోని లొసుగులు, వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే తెలివితేటలు వారికి లేవు. చదువు లేకపోవడం...అన్నిటికి మించి ఉద్యమాన్ని నడిపే ఆర్థిక స్థోమత లేకపోవడం...నైజాం సర్కారుకున్న అత్యంత ఆధునికమైన ఆయుధ సామగ్రి లేకపోవడం....ఇవన్నీ ఉద్యమం విఫలమవడానికి కారణాలు. మరీ ముఖ్యంగా భీమ్‌ ఈ ఉద్యమంలో గోండు, కొలం తెగలను తప్ప అడవిలో ఉన్న మిగతా ఆదివాసీ తెగలను కలుపుకోలేదు. ఈ కారణాలు భీమ్‌కి స్పష్టంగా తెలుసు. ''మనం పోరాటం చేసేది ఖాయం. ఇందులో మనం గెలిస్తే మంచిదే. కానీ మిగలకపోతేనో? మనం ఎందుకు ఓడిపోయామో మనకు తెలిసి ఉండాలి. రేపటి ప్రపంచం కోసం మనం సత్యాన్ని నిలబెట్టాలి'' అని జనాన్ని ఉద్దేశించి భీమ్‌ అంటాడు. 1940 అక్టోబర్‌ 27న నైజాం సర్కార్‌ వందలాది సైనికులను తీసుకొని జోడెన్‌ ఘాట్‌లో సుమారు ఐదు గంటలపాటు పోరు సాగించింది. ఘాట్‌ పైకి ఎక్కిన సైన్యానికి గోండు గూడెం ద్రోహి కుర్దు పటేల్‌ చూపించడంతో భీమ్‌ని సైనికులు కాల్చి చంపారు. భీమ్‌ చనిపోయిన తర్వాత 12 గ్రామాల ప్రజలు చెల్లాచెదురయ్యారు. సమిష్టి (ప్రజా) చైతన్యం తీసుకు రాలేక పోవడంతో భీమ్‌ పూర్తి స్థాయి విజయం సాధించలేకపోయాడు. అయితే ముందు తరాలకు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం వారి లక్ష్యం మరింత చేరువయ్యేలా చేసింది. కొమురం భీమ్‌, అల్లూరి, వర్లీ ఆదివాసీల పోరాటాలు నేడు గిరిజన ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా వున్నాయి.

నేడు కొమురం భీమ్‌ జయంతి

పి. అప్పలనర్స
(వ్యాసకర్త గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)