ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స
ప్రజాశక్తి - పాడేరు :ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారానికి ఈనెల 11న గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించ తలపెట్టిన 'చలో కలెక్టరేట్' ఆందోళనకు అధికసంఖ్యలో గిరిజనులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స పిలుపునిచ్చారు. గురువారం చింతపల్లి గిరిజన భవన్‌లో పాడేరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల గిరిజన సంఘం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా అమాయక గిరిజనులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. హైడ్రోపవర్ ప్రాజెక్ట్ పేరుతో మన్యంలోని గిరిజనుల భూములను నాశనం చేయడానికి కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. బోయ/ వాల్మీకులు, బెంతు ఒరియాలు, ఇతర అనుబంధ కులాలను ఎస్‌టి జాబితాలో చేర్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి నివేదిస్త్తే, గిరిజనుల ఓట్లతో గెలిచి, అధికారపీఠంపై ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు కనీసం నోరెత్తకుండా దిష్టిబొమ్మల్లా కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జిఒ 3ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చి మూడేళ్లు గడుస్తున్నా, దీనిపై గిరిజన సలహా మండలిలో కనీసం చర్చించిన దాఖలు లేవన్నారు. ప్రధానంగా ఈ మూడు అంశాలతోపాటు కాఫీ రైతులకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు తక్షణమే చెల్లింపులు, ఇతరత్రా సమస్యలపై చలో కలెక్టరేట్ ఆందోళనకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.
గిరిజనుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం, బోయ/వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చడం, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంతో మన్యవాసుల మనుగడ ప్రశ్నార్థకం వంటి గిరిజన వ్యతిరేక విధానాలకు పూనుకుంటోందని,తక్షణమే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ, ప్రజాప్రతినిధుల్ని అడ్డుకుంటున్నా కనీస స్పందన లేకపోవడం చూసే,్త, గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమౌతోందన్నారు. నమ్మించి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన మన్యంలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు తిరుగుతున్నారని, ఇది ఏ మాత్రం క్షమించరానిదని హెచ్చరించారు. ఇప్పటికైనా వారంతా గిరిజనుల పక్షాన ఉంటారా? లేదా గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారా తేల్చుకోవాలని హెచ్చరించారు. .గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగాఅమలు కాకపోవడం, ఇతరులకు ప్రయోజనకరంగా మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనానికి ఇంతగా అన్యాయం జరుగుతున్నా, తమ సొంత ప్రయోజనాలను చూసుకుంటున్న ఏజెన్సీ ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నారని, అడవి బిడ్డలకు న్యాయం చేయాలన్న మనస్సాక్షి ఉంటే చట్టసభల్లో గొంతు విప్పేవారని ప్రశ్నించారు. గిరిజనానికి వాటిల్లుతున్న నష్టంపై ప్రశ్నించడానికి ప్రతి గిరిజనుడూ సైనికుడిగా ముంందుకు రావాలన్నారు. పోరాటం చేసైనా హక్కులను పరిరక్షించుకోకుంటే, భావితరాల మనుగడ ప్రశ్నార్థకమౌతుందన్నారు. ఈనెల 11న పాడేరులో చలో కలెక్టరేట్ ఆందోళనతో గిరిజన వాణి, ఆక్రందన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించేలా కలెక్టరేట్ దద్దరిల్లాలని, దానికి గిరిజనులందరూ ఐక్యంగా కదలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోనంగి చిన్నయ్య పడాల్, జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి,జీకే వీధి మండల నాయకులు గడుతూరి సత్యనారాయణ,అంపురంగి బుజ్జిబాబు, జి మాడుగుల మండల నాయకులు దీనబంధు, కొయ్యూరు మండల నాయకులు అప్పలనాయుడు పాల్గొన్నారు.










