ప్రజాశక్తి- కొయ్యూరు
స్వాతంత్య్రోద్యమంలో ఆదివాసీ యోధులు చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. కొయ్యూరు మండలం బట్ట పనుకుల పంచాయతీ పరిధి లంకవీధి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటం దొర శత వర్థంతి వేడుకలు పాడేరు ఐటిడిఎ, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గంటం దొర కాంస్య విగ్రహాన్ని ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఐటిడిఎ పిఒ అభిషేక్, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గంటం దొర కుటుంబ సభ్యులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు జరగాలని ఈ సభలోనే నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన గాం గంటం దొర కుటుంబ సభ్యులు నిలువు నీడ లేకుండా ఉన్న పరిస్థితుల్లో వారందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహ నిర్మాణానికి పూనుకున్న ఎన్‌సిసి వారికి ధన్యవాదాలు తెలిపారు. గాం గంటం దొర, గాం మల్లుదొర, బోనంగి పండు పడాల్, తగ్గి వీరయ్య దొర వంటి స్థానిక నాయకులకు అల్లూరి సీతారామరాజు శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారు నుంచి విముక్తి కోసం పోరాడేలా తీర్చిదిద్దారని తెలిపారు. అటువంటి పోరాటం నడిచిన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. గంటం దొర కుటుంబ సభ్యులకు ఇళ్ల నిర్మాణంలో సహాయ సహకారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గంటం దొర కుటుంబ సభ్యుల్లో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపించే ఆలోచన కూడా చేస్తున్నామని, ఈ విషయంపై ఐటిడిఏ పీవో అభిషేక్‌తో చర్చించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, పీఎసీఎస్ చైర్మన్ సూరిబాబు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు నాని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు శోభా సోమేశ్వరి, షేక్ మీరా, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, బుజ్జి, సీనియర్ నాయకులు గాడి సత్తిబాబు, మహేష్, అప్పారావు, కొమ్ముక శేఖర్, ముసలినాయుడు, ఎంపీటీసీ గాంధీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










