గుమ్మలక్ష్మీపురం/సీతంపేట: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా మారుమూల గిరిజన పల్లెల్లో ఆదివాసీలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్ర హక్కులు, ఫలాలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. 7 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు మారినా ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో మాత్రం వెలుగురేఖ నిండలేదు. నాటికీ నేటికీ ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అంతంత మాత్రంగానే ఉంది. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అభివృద్ధి శూన్యం. కళ్లలో కాంతి లేని ఆదివాసీ బిడ్డలకు నిజమైన పండుగ లేనట్టే. ప్రభుత్వం పండగల పేరుతో ఆర్భాటాలు మాని ఆదివాసీ గిరిజనుల హక్కులు, చట్టాలు పగడ్బందీగా అమలు చేసి వారి హృదయాల్లో చిరునవ్వులు పరిమళించిన నాడే నూటికి నూరు శాతం ఆదివాసీ పండుగ. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
గిరిజన చట్టాలు చట్టుబండలే...
తరతరాల నుంచి అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలకు ప్రభుత్వ పాలకుల విధానాలతో, కార్పొరేట్ శక్తులతో అడవిలో కూడ రక్షణ కరువైంది. ఆదివాసీల జాగృతికి ఎన్నో చట్టాలు అమలు చేసినా చట్టుబండలు గానే మిగిలిపోయాయి. అమాయకులైన ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆనాటి అల్లూరి సీతారామరాజు నుంచి మొన్న జరిగిన శ్రీకాకుళ రైతాంగ పోరాటం ఉద్యమం వరకు పోరాడి సాధించుకున్న గిరిజన హక్కులు, చట్టాలను నేటి పాలకులు స్వార్థ రాజకీయాల కోసం నిర్వీర్యం చేస్తున్నారు. 1/70, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, ఎల్ టి ఆర్, ఉపాధి హామీ చట్టం పటిష్టంగా అమలు జరగడం లేదు. గిరిజన అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఎ పనితీరు అంతంత మాత్రమే. జిఒ 3 రద్దు, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ జాబితాలో చేర్చే ప్రక్రియ నేటి వరకు జరగలేదు.
గిట్టుబాటు ధర లేని అటవీ ఉత్పత్తులు
గిరిజనులు పండించే అటవీ ఉత్పత్తులకు దళారుల బెడద వెంటాడడంతో సరైన గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట మండలాల్లో ఎక్కువ శాతం చింత చెట్లు, జీడి తోటలు ఉన్నాయి. గిరిజనులకు ప్రధానమైన ఈ రెండు పంటలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో వచ్చిన పంటను తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి.
సమస్యలతో సహజీవనం.....
పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో మారుమూల కొండల్లో ఆదివాసీలు వందలాది సమస్యలతో సహ జీవనం సాగిస్తున్నారు. నేటి వరకు గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజన గ్రామాలు అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఇక్కడ విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక సౌకర్యాలు నోచుకోని పరిస్థితి. అక్షరాస్యతకు దూరంగా అనారోగ్యంతో మరణాలకు దగ్గరగా జీవనం సాగిస్తున్నారు.
గిరిజన కళలు కనుమరుగు
ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రోజు రోజు గిరిజన కళలు కనుమరుగవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో సవర, జాతపు, కొండదొర, గదబ గిరిజన తెగలు జీవనం సాగిస్తున్నాయి. వారు నేటికీ సాంప్రదాయ కళలు, ఆచారాలు పాటిస్తున్నారు. డప్పు, తుడుము, సన్నాయి వాయిద్య కళాకారులు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బాధ్యతతో పని చేస్తున్నారు. గిరిజన కళలు, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గుమ్మలక్ష్మీపురంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్ల నుంచి కోరుతున్నా ఎటువంటి చర్యలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన కష్టాలపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలి
భారత రాజ్యాంగం ఆదివాసీల కోసం రూపొందించిన చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలి. గిరిజన హక్కులకు భంగం కలగకుండా చూడాలి. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలుల న్యాయం జరిగేలా చూడాలి.
నిమ్మక నారాయణరావు,
మాజీ ఉపసర్పంచ్, కంబగూడ, సీతంపేట మండలం.










