ప్రజాశక్తి-విఆర్.పురం
గిరిజనుల హక్కులు, చట్టాల రక్షణకు ఆదివాసీలంతా ఐక్యమై పోరాటం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని పెద్దమటపల్లి పంచాయతీ పరిధి కిష్టారం గ్రామంలో పూనం ప్రదీప్ కుమార్ అధ్యక్షతన ఏపీ గిరిజన సంఘం మండలం మూడో మహాసభ జరిగింది. ముందుగా కుంజ నాగిరెడ్డి సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ అటవీ సంరక్షణ చట్టానికి సవరణ చేస్తూ బిల్లును రూపొందించిందని, ఇది ఆమోదం పొందితే పీలా చట్టం నిర్వీర్యమవుతుందని, ఏజెన్సీలోని సంపద కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోతుందని తెలిపారు. అడవుల నుండి ఆదివాసీలను గెంటివేయాలని కుట్ర చేస్తుందన్నారు. అర్హతలేని వారిని ఎస్టీ జాబితాలో చేర్చి గిరిజనుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నట్లు చెప్పారు. వైసిపి, టిడిపి, బిజెపి పార్టీలు ఐక్యమై గిరిజనుల హక్కులను చట్టాలపై దాడి చేస్తున్నాయన్నారు. అడవిలో జంతువులకు ఉండే ప్రాధాన్యత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. గిరిజనులకు షెడ్యూల్ ఏరియాలో ఉద్యోగాలు కల్పించే జీవో 3 పునరుద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, సీసం రమేష్ మాట్లాడుతూ. ఏజెన్సీకి ఆనుకొని జీవిస్తున్న గిరిజనుల గ్రామాలను ఐదవ షెడ్యూల్‌లో చేర్చకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అర్హులు కాని బోయ, వాల్మీకి బెంత్ ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చర్యలు చేపట్టడం దారుణమన్నారు. పోలవరం నిర్మాణంలో అధిక శాతం గిరిజనులే నిర్వాసితులవుతున్నా, వారికి పునరావసం కల్పించడంలో పాలక పక్షాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం గిరిజన సంఘం మండల కమిటీ 21 మందితో ఎన్నికైంది. సంఘం మండల అధ్యక్షులుగా పులి బుజ్జి, కార్యదర్శిగా పూనం ప్రదీప్ కుమార్, సహాయ కార్యదర్శులుగా పండ వెంకటేష్, మోసం చందర్, తోడం రవికుమార్, ఉపాధ్యక్షులుగా పండా గోపాల్, సోయం జోగారావు, కురసం బేబీ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, గిరిజన సంఘం నాయకులు కాక అర్జున్ దొర, పులి సంతోష్, వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి సోయం చిన్నబాబు. కుంజ నాగిరెడ్డి, కారం సత్తిబాబు. చిక్కాల రామారావు కార్యకర్తలు పాల్గొన్నారు.










