Aug 21,2023 00:12

మాట్లాడుతున్న చిన్నయ్యపడాల్‌

ప్రజాశక్తి-పాడేరు:ఆదివాసీ హక్కులను హరిస్తే ఊరుకోమని సిపిఐ బస్‌ యాత్రలో పలువురు వక్తలు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యాన రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల 17న ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్ర ఆదివారం చింతపల్లికి చేరుకుంది. ముందుగా చింతపల్లిలోని హనుమాన్‌ కూడలి వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ, నియంతృత్వ విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 9 ఏళ్ల మోడీ పాలనలో పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మాయ మాటలతో ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన మోడీ కులం, మతం పేరుతో పబ్బం గడుపు కుంటున్నారని విమర్శించారు. హిందువులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెడుతున్న నరేంద్ర మోడీ ఏ ఊరిలో వారికి ఏమి సంభవించిందో చెప్పాలని ప్రశ్నించారు. మైనార్టీలను అభద్రతా భావానికి గురి చేసి మెజార్టీ హిందువుల ఓట్లతో మరల అధికారంలోకి రావాలని మత ప్రాతిపదికన విభజన చేస్తున్నారని విమర్శించారు. మోడీ పాలనలో ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా అంబానీ, ఆదానీలు ఎదిగారన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, గిరిజనులు పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికీ రోడ్లు, కరెంటు, మంచినీరు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, గిరిజన చట్టాలు, హక్కులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. 1/70 చట్టం ఉన్నా ప్రభుత్వాల అండదండలతో గిరిజనేతరులకు చుట్టంగా మారిందన్నారు. భూ రక్షణ చట్టం, ఉపాధి చట్టం, జీవో 3 రద్దు చేసి అడవుల్ని బిజెపి ప్రభుత్వం ప్రవేట్‌పరం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ, రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకురాలు అత్తిలి విమల, యువజన సమాఖ్య నాయకుడు లెనిన్‌ బాబు, రాష్ట్ర విద్యార్థి సమాఖ్య నాయకుడు జాన్సన్‌ బాబు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి చండ్రా నాయక్‌, ఏపీ యువజన సమాఖ్య నాయకుడు రాజేంద్ర ప్రజానాట్యమండలి నాయకుడు పెంచలయ్య జిల్లా మహిళా సమాఖ్య నాయకురాలు దీసరి బీమలమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకర విష్ణుమూర్తి, సింహాచలం, సేగ్గే కొండలరావు, అంజలి శనివారం సర్పంచ్‌ పేట్ల రాజబాబు, ఎర్ర బొమ్మల ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబు, చింతపల్లి జీకే వీధి సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శిలు పేట్ల పోతురాజు, కంకిపాటి సత్తిబాబు, పాంగి ధనుంజరు .గడుతూరి సత్యనారాయణ, సిపిఎం నాయకులు సాగిన చిరంజీవి జీవన్‌ కృష్ణ మజ్జి కిల్లో సింహాచలం రాంబాబు మేక సత్యనారాయణ, మఠం సూరి పడాల్‌, అమర్‌, జల్లి రాజబాబు, కూడా రాధాకృష్ణ, సతీష్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.