ప్రజాశక్తి-మారేడుమిల్లి
మారేడుమిల్లి మండలం లోతట్టు గ్రామమైన బొడ్లంక గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి గురువారం ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నుండి డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. ఎయు పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన పరిశోదన విద్యార్థి రాజ్‌కుమార్‌రెడ్డి ''పంచాయతీ రాజ్ సంస్థలో షెడ్యూల్ తెగల రాజకీయ భాగస్వామ్యం'' తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేస్ స్టడీ అంశాన్ని తీసుకొని రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ పెటేటి ప్రేమానందం వారి సమక్షంలో పరిశోదన చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు చదువుకున్న యువత రాజకీయాల పట్ల శ్రద్ద చూపించి పంచాయితీ, గ్రామ అభివృద్ధి చెందాలంటే విద్యావంతులైన యువతకే సాధ్యమని అందులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, పంచాయితీ రాజ్ వ్యవస్థపై అవగాహన లోపం వలన అభివృద్ధి కుంట పడుతుందని, ఐటిడిఎ ద్వారా మారుమూల ప్రాంతాలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. దానికి రాజకీయ దోపిడీయే కారణని తన పరిశోదనలో తేల్చారు. ఈ పరిశోదన నిమిత్తం ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ తప్రధానం చేసింది. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి పిహెచ్‌డి ప్రొసీడింగ్స్ ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ అధిపతి ప్రొఫెసర్ పి.వీర్రాజు, ఆచార్యులు డాక్టర్ హరిబాబు, డాక్టర్ రత్నం రాజు, డాక్టర్ కె.సత్యనారాయణ, ఎయు ఎస్‌టి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సమ రెడ్డి సింహాద్రి, యూనివర్సిటీ సూపరింటెండెంట్ దొండ సత్యనారాయణ పాల్గొన్నారు.










