Sep 05,2021 18:47

అతనో ఫారెస్ట్‌ ఆఫీసర్‌. ఆయన తలచుకుంటే ఆ ప్రాంతంలోని చిన్నారులను జైళ్లల్లో మగ్గేలా చేయగలరు. కానీ అది ఆయన వ్యక్తిత్వానికి పూర్తిగా వ్యతిరేకం. వారిలో దాగున్న కళను వెలికితీసి, దేశం గర్వించే వ్యక్తుల్లా తయారుచేయాలి అనుకున్నారు. అందుకోసం ఎన్నో ఆటుపోట్లను అవలీలగా అధిగమించారు. రాత్రనక, పగలనక కష్టపడి, వారికొక లక్ష్యాన్ని ఏర్పరిచారు. గిరిజన పిల్లల్లోని సామర్థ్యాన్ని గురిచూసి వెలుగులోకి తెచ్చి, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్ర నాసిక్‌జిల్లా ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి. గిరిజనుల కోసం ఆయనేమి చేస్తున్నారో తెలుసుకుందాం.

ఆనంద్‌రెడ్డి 2018వ బ్యాచ్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌. కొంతకాలం క్రితమే మహారాష్ట్రలోని నాసిక్‌జిల్లాకు బదిలీ అయ్యారు. అది ఒక దట్టమైన అడవీ ప్రాంతం. 'నాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఈ అడవిలో రకరకాల పక్షులను నా కెమెరాలో బంధించాలి అనుకున్నా. అడవిలో ఎంత దూరం వెళ్లినా ఒక్క పక్షి కూడా కనపడలేదు. అన్నీ ఖాళీ చెట్లే దర్శనమిచ్చాయి. అది నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేసింది. నా మనసెందుకో కీడు శంకించింది. ఈ అడవిలో అసలేం జరుగుతోందో తెలుసుకోవాలి అనుకున్నా. ఇక్కడి పిల్లలు గిరిజన సంప్రదాయ ఆయుధమైన గులెల్‌ లేదా స్లింగ్‌షాట్‌తో పక్షులను వేటాడతారని తెలుసుకున్నా. వీరివల్లే అడవిలోని పక్షులన్నీ చనిపోయాయని తెలిసి, నమ్మలేకపోయా' అంటున్నారు ఆనంద్‌రెడ్డి.


వాస్తవానికి ఆనంద్‌రెడ్డి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జంతు సంరక్షణ చట్టం కింద గిరిజన పిల్లలకు ఏడేళ్లు జైలుశిక్ష పడేలా చేయడం. రెండోది వారిలోని నైపుణ్యానికి మరికొంత శిక్షణ ఇప్పించి ఆర్చరీ, హాకీలాంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా చేయడం. ఆయన రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. సమీపంలోని గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నా. మొదటిది అమలు చేయడం సులభమే. రెండోది చేయాలంటే దీర్ఘకాలం కష్టపడాలి. గ్రామస్తులు తమ పిల్లలతో పాటు మా కార్యాలయంలో సమావేశం కావాలని సిబ్బందితో కబురు పంపాను. మొదట్లో చాలామంది సమావేశానికి రావడానికి సంశయించారు. అక్కడకు వస్తే శిక్షలు వేయిస్తానని భయపడ్డారు. కానీ నెమ్మదిగా వారిలోని సందేహాలను దూరం చేశా. పక్షులను చంపడం వల్ల వారు పెద్దగా ప్రయోజనం పొందరని చెప్పగలిగా. పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లేలా చేస్తున్నారో వివరించాను. దాంతో ఆ ప్రాంత వాసులు పక్షులను చంపడాన్ని తగ్గించారు. అంతటితో నేను ఆగాలని అనుకోలేదు. గిరిజన పిల్లల కోసం స్పోర్ట్ప్‌ పరికరాలను అందించా. ఇంకా సైకిళ్లు, పుస్తకాలను పంపిణీ చేసి, వారి మనసు చదువువైపు మరలేలా చేశా. జులై 11 నాటికి, 93 గ్రామాలకుగానూ 92 గ్రామాల్లోని పిల్లలు 674 స్లింగ్‌షాట్‌లను తిరిగి అప్పగించారు' అంటున్నారు రెడ్డి.


క్రీడా పరికరాలు కొనడానికి బడ్జెట్‌ లేకపోయినా తన సొంత డబ్బుతోనే క్రీడాసామాగ్రి కొనుగోలు చేయడం మొదలెట్టారు రెడ్డి. తెలిసిన సిబ్బంది ఆయనకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. 'మేము క్రీడా సామగ్రి కొనుగోలుకు మార్కెట్‌కు వెళ్లినప్పుడు దుకాణదారులు మా లక్ష్యాన్ని తెలుసుకుని, ఎక్కువ డిస్కౌంట్‌ ఇచ్చారు' అంటున్నారు రెడ్డి. ఒకప్పుడు ఆ ప్రాంతంలో పక్షులను చంపడంలో బిజీగా ఉండే పిల్లలు నేడు ఆటపాటలతో పాటు చదువులోనూ రాణిస్తున్నారు. కొన్నేళ్లలోనే ఈ గిరిజన పిల్లల్లో కొందరు భారతదేశానికి పతకాలు తెచ్చి, మనమందరం గర్వించేలా చేస్తారని ఆశిద్దాం.