ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు ఎన్.విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలోని బోయ/ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించిన ప్రతిపాదనను ఆమోదించి అమలు చేయాలని పార్లమెంట్‌లో విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంపై ఆదివాసీ గిరిజన సంఘం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్‌దేవ్ మాట్లాడుతూ, బోయ/వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం సరికాదని గిరిజన వర్గాలన్నీ వ్యతిరేకిస్తున్నా వైసిపి పాలకులు మొండి వైఖరితో ముందుకు వెళుతున్నారని విమర్శించారు. బోయ/వాల్మీకుల్ని గిరిజన జాబితాలో చేర్చి ఆదివాసిలకు ముప్పు తల పెడితే వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఎల్.సుందర్‌రావు పాల్గొన్నారు.
పెదబయలు:
బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పెద్దలసభలో మాట్లాడటం సరికాదని సీతగుంట సర్పంచ్ పలసి మాధవరావు తెలిపారు. జిఓ 3 రద్దు చేసి గిరిజనేతరులతో పోస్టులు భర్తీ చేస్తూ గిరిజన యువత పొట్టకొట్టారన్నారు. ఆదివాసీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. విజయసాయిరెడ్డి మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల రాజకీయం విడనాడాలన్నారు.










