May 20,2023 22:48

గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొన్న విదేశీ విద్యార్థులు, విదేశీ డైరెక్టర్లు


ప్రజాశక్తి - గండేపల్లి
సూరంపాలెం ఆదిత్య విద్య ప్రాంగణంలో గల వివిధ కళాశాలలలో విద్యనభ్యసిస్తున్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, జింబాబ్వే స్కాలర్‌షిప్‌ విభాగం అధ్యక్షులు మాన్యాంగ్‌ ఫినియాస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కాలర్‌ షిప్స్‌ టిండై, సౌత్‌ సుడాన్‌ ఎంబసి సెక్రటరీ జిబెని యూన్నెస్‌ అముమ్‌ పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్‌ ఎం.ఎస్‌.రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆదిత్య ఇంటర్నేషనల్‌ ప్రమాణాలతో క్వాలిటీ విద్యను అందిస్తూ దేశ విదేశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మన్ననలు పొందుతోందన్నారు. ముఖ్య అతిధులు మాట్లాడుతూ ల్యాబ్‌, లైబ్రరీ, హాస్టల్‌ కాంటీన్‌ వసతులుగల ఆదిత్యలో మరింత మంది విద్యార్థులు చేరేలా ఉత్తమ ఫలితాలు సాధించేలా తమవంతు సహ కారం అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అంద జేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్యాంపస్‌లోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఆదిరెడ్డి రమేష్‌, డోలా సంజరు, కె.రవిశంకర్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ పరంజీత్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ విద్యార్థులు నిర్వహించిన పాటల పోటీలు, డాన్స్‌ పోటీలు, ఫ్యాషన్‌ షో, సాంస్కతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో బంగ్లాదేశ్‌, కాంగో, లెసోతో, మజాంబిక్యూ, నేపాల్‌, యుగాండా, సౌత్‌ సుడాన్‌, సుడాన్‌, జాంబియా, జింబాబ్వే దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం తెలుగు ఫ్రొఫెసర్‌ నీలిమ యాంకరింగ్‌తో ఎంతో ఉత్సాహంగా సాగింది.